వైభవంగా దీపావళి సంబురాలు
ABN , Publish Date - Oct 21 , 2025 | 11:18 PM
జిల్లాలో దీపావళి వేడుకలను ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలను సోమ, మంగళవారాల్లో ఘనంగా జరుపుకున్నారు. దీపావళిని పురస్కరించుకొని ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు ఇండ్లలో, షాపుల్లో ధన లక్ష్మీ పూజలను నిర్వహించారు.
మంథని, అక్టోబర్ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దీపావళి వేడుకలను ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలను సోమ, మంగళవారాల్లో ఘనంగా జరుపుకున్నారు. దీపావళిని పురస్కరించుకొని ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు ఇండ్లలో, షాపుల్లో ధన లక్ష్మీ పూజలను నిర్వహించారు. మంథనిలోని మహాలక్ష్మీ, లక్ష్మీనారాయణస్వామి ఆలయాల్లో దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మీ ఆలయ ఆవరణలో ఆలయ ప్రధానార్చకులు మారుపాక ప్రశాంత్‌శర్శ ఆధ్వర్యంలో భక్తులు ధనలక్ష్మిపూజ కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి ఇండ్లలో శ్రీకేదారేశ్వస్వామి నోములను ప్రజలు నోముకున్నారు. రాత్రి ఇండ్లు, షాపుల ఎదుట బాణాసంచా పేల్చి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పండగకు వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులతో ఇండ్లన్ని సందడి గా మారాయి.
కళ్యాణ్‌నగర్/మార్కండేయకాలనీ, (ఆంధ్రజ్యోతి): చీకటిని తొలగించి ప్రజల్లో వెలుగులు ప్రసారం చేసేది దీపావళి పండుగ అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్, మనాలీ దంపతులు అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో లక్ష్మీపూజ నిర్వహించి కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో కాకర్స్‌ను కాల్చి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అంగరంగ వైభవంగా ప్రజలు దీపావళి వేడుకలను నిర్వహించారు. ఈ సారి లక్ష్మీపూజ, నోములు రెండు రోజులు రావడంతో సోమవారం రాత్రి లక్ష్మీనగర్, కళ్యాణ్‌నగర్, మార్కండేయకాలనీ, తిలక్‌నగర్ ప్రాంతాల్లో వ్యాపారులు రాత్రి 12గంటల నుంచి తెల్లవారుజాము వరకు లక్ష్మీపూజ నిర్వహించారు. మంగళవారం నోముకునే వారు సాయంత్రంలోగా నోముకున్నారు. కుటుంబ సభ్యులంతా ఒకచోటుకు చేరి నోములను నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాల వద్ద కొనుగోలు కోసం భారీగా జనం తరలివచ్చారు. గోదావరిఖని మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. మంగళవారం తెల్లవారుజాము వరకు బాణా సంచా మోతలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మార్మోగింది.