శిథిలావస్థకు చేరిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
ABN , Publish Date - May 17 , 2025 | 12:09 AM
మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది. సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం ఆసుపత్రి నిర్మించగా ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. వర్షాలు కురిస్తే ఆసుపత్రి స్లాబ్ ఉరుస్తుంది. దీంతో ఆసుపత్రిలోకి నీరు చేరి రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.
కాల్వశ్రీరాంపూర్. మే 16(ఆంద్రజ్యోతి): మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది. సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం ఆసుపత్రి నిర్మించగా ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. వర్షాలు కురిస్తే ఆసుపత్రి స్లాబ్ ఉరుస్తుంది. దీంతో ఆసుపత్రిలోకి నీరు చేరి రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. గోడలు కూడా పగుళ్లు బారాయి. ఆసుపత్రిపై భాగాన అక్కడక్కడ పెచ్చులు ఊడుతున్నాయి. పెచ్చులు ఊడి కింద పడితే రోగులకు, సిబ్బందికి ప్రమాదం జరిగే అవ కాశం ఉంది. డాక్టర్లు, సిబ్బంది ఉండే క్వార్టర్లు కూడా ఆనవాళ్లు లేకుండా పోయాయి. ప్రభుత్వం స్పందించి నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆసుపత్రి వివరాలు ఇలా..
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో 1960లో ప్రభుత్వ ఆయుర్వేదిక ఆసుపత్రి ఉండేది. అది మూతపడడంతో 1970లో ఆరు పడకలతో ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి నిర్మించారు. 1979లో మండలంలోని గం గారం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే స్వర్గీయ జిన్న మల్లారెడ్డి 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయగా కాల్వశ్రీరాంపూర్ చెందిన మాజీ ఎమ్మెల్యే కాల్వ రామచంద్రారెడ్డి ఆసుపత్రి నిర్మాణానికి రెండెకరాల భూమిని విరా ళంగా ఇచ్చారు. దీంతో నాలుగున్నర సంవత్సరాల క్రితం 24గంటలు వైద్య సేవలు అందించే 30 పడకల ఆసుపత్రి నిర్మించారు. ఆ కాలంలో రహదారులు సరిగా లేక బస్సులు నడిచేవి కావు. దీంతో ఆసుపత్రితో పాటు సిబ్బంది ఉండేందుకు వీలుగా క్వార్టర్లను కూడా నిర్మించారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది 24 గంటలు రోగులకు అందుబాటులో ఉండి వైద్యం అందించే వారు. ఓదెల, ముత్తారం, భూపాలపెల్లి జిల్లా టేకుమట్ల మండలం నుంచి రోగులు ఎడ్లబండ్ల ద్వారా వచ్చి వైద్యం చేయించుకునే వారు. వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండడంతో ప్రసవా లతోపాటు పలు శస్త్రచికిత్సలు జరిగేవి. క్రమంగా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య తగ్గిపోయింది. ఆర్‌ఎంపీల సహాయంతో పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. ఈ ఆసుపత్రికి ఇప్పటికీ ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం మండలాల నుంచి రోగులు వస్తున్నారు. ఆసుపత్రి భవనం, సిబ్బంది క్వార్టర్లు నిర్మించి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రిని ఆరు పడకలుగా కుదించింది. భవనం నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఆసుపత్రి పడకలను కుదించడంపై ప్రజాప్రతిని ధులు నిరసన వ్యక్తం చేయడంతో ఆసుపత్రి నిర్మాణం నిలిచిపోయింది.