అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Jun 20 , 2025 | 12:36 AM
జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఆయా ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పెద్దపల్లి జూన్ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఆయా ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. జడ్పీహెచ్‌ఎస్ రామగుండం పాఠశాలకు 40 లక్షల సీఎస్‌ఆర్ నిధులు అందుబాటులో ఉన్నాయని, వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. పాఠశాల అభివృద్ధి పనులకు వెంటనే ఎస్‌ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) తీర్మానాలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జూనియర్ కళాశాల అభివృద్ధి పనులకు నిధులు అందుబాటులో ఉన్నందున పనులు వారం రోజులలో ప్రారంభం కావాలని అన్నారు. పెద్దపల్లి ఆసుపత్రి భవనం నిర్మాణ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రి మొదటి అంతస్తు మరమ్మతు పనులు పూర్తి చేసి ఆసుపత్రికి అప్పగించినట్లు సర్టిఫికెట్ సమర్పిస్తే బిల్లుల చెల్లింపులు పూర్తి చేస్తామన్నారు. జీజీహెచ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో 98 లక్షలతో మరమ్మతు పనులు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రతిపాదనలు పక్కాగా సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో మరమ్మతు పనుల పురోగతి వివరాలను తెలుసుకున్న కలెక్టర్ వాటిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ.
పెద్దపల్లి కల్చరల్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈనెల 21న జిల్లాలో అధికారికంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఉదయం 7.30 గంటలకు ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో కూనారం రోడ్డులోని ఆర్‌కే గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, జిల్లాలోని యువత, మహిళలు, ఉద్యోగులు, కళాకారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.