రామగుండంలో సర్వీస్ రోడ్ల అభివృద్ధి
ABN , Publish Date - May 27 , 2025 | 12:15 AM
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రూ.25కోట్లతో రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్లను అభివృద్ధి చేయనున్నట్టు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. సోమవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, హెచ్‌కేఆర్, ఆర్‌అండ్‌బీ, సింగరేణి, పోలీస్ అధికారులతో ఆయన రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్డు పెండింగ్, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించారు.
గోదావరిఖని, మే 26(ఆంధ్రజ్యోతి): రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రూ.25కోట్లతో రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్లను అభివృద్ధి చేయనున్నట్టు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. సోమవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, హెచ్‌కేఆర్, ఆర్‌అండ్‌బీ, సింగరేణి, పోలీస్ అధికారులతో ఆయన రాజీవ్ రహదారి సర్వీస్ రోడ్డు పెండింగ్, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించారు. రాజీవ్ రహదారి, పారిశ్రామికంగా ఎంతో కీలకమైందని, పరిశ్రమల అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ట్రాఫిక్, భద్రత, వాహనదారుల సౌకర్యార్థం సర్వీస్ రోడ్డు విస్తరణ అవసరమన్నారు. రామ గుండంలో ప్రమాదాల నివారణకు సర్వీస్ రోడ్ల నిర్మాణం, విస్తరణ ఆవశ్య మని, ఇందుకు పరిశ్రమలు సహకరించాలన్నారు. సింగరేణి గెస్ట్‌హౌస్, జీఎం ఆఫీస్‌కార్నర్, బీపవర్‌హౌస్ ప్రాంతాల్లో పరిశ్రమలకు చెందిన ప్రహరీలు వెనక్కి జరిపి సర్వీస్ రోడ్లను విస్తరించేందుకు చర్యలు చేపడుతామన్నారు. రామగుండం ప్రాంతంలో ట్రాఫిక్ పెరిగిందని, అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ అవసరమన్నారు. జీఎం ఆఫీస్ జంక్షన్‌ను విస్తరించాలని, లైటింగ్ ఏర్పాట్లు పెంచాలన్నారు. మున్సిపల్ జంక్షన్, బస్టాండ్, ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు వంటి ప్రాంతాల్లో హెచ్‌కేఆర్ సంస్థ లైటింగ్ పెంచాలన్నారు. బస్టాండ్ నుంచి మున్సిపల్ జంక్షన్, ఎల్‌ఐసీ ఆఫీస్ నుంచి గెస్ట్‌హౌస్ వరకు సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు. సింగరేణి జీఎం లలిత్‌కుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ హెచ్‌కేఆర్, కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.