Share News

పూతోటలుగా మారిన కూడళ్లు

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:57 PM

జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలను సోమవారం రాత్రి మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంతో పాటు డివిజన్‌లోని పలు గ్రామాల్లో మహిళలు, యువతులు, పిల్లలు ఉదయం నుంచి వివిధ రకాల పూలను సేకరించి గౌరమ్మలను పూజించి బతుకమ్మలను పేర్చి సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలను ఆటాపాటలతో ఉత్సాహంగా నిర్వహించారు.

పూతోటలుగా మారిన కూడళ్లు

పెద్దపల్లి కల్చరల్‌/మంథని, సెప్టెంబరు29(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలను సోమవారం రాత్రి మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంతో పాటు డివిజన్‌లోని పలు గ్రామాల్లో మహిళలు, యువతులు, పిల్లలు ఉదయం నుంచి వివిధ రకాల పూలను సేకరించి గౌరమ్మలను పూజించి బతుకమ్మలను పేర్చి సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలను ఆటాపాటలతో ఉత్సాహంగా నిర్వహించారు. గౌరమ్మను గుమ్మడి, కట్ల, తంగెడు, కలువ, సీతమ్మ జడలు, బంతి, ఛామంతి పూలతో పాటు గునుగ , టేకు పూలకు వివిధ రకాల రంగులు అద్ది ఒకరికంటే ఒకరు మహిళలు రంగురంగుల పెద్ద, పెద్ద బతుకమ్మలను పేర్చి అర్థరాత్రి వరకు డీజే సౌండ్స్‌ మధ్య వేడుకలు నిర్వహించారు. అనంతరం భాజాభజంత్రీలతో చెరువు, వాగులు, కుంటలు, మానేరు, గోదావరి నదుల్లో నిమజ్జనం చేసి ఇస్తినమ్మ వాయినం.. పుచ్చుకుంటినమ్మ వాయినమంటూ తీపి పదార్థాలు పంచుకుంటూ నిమజ్జనం చేసి సాగనంపారు. మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ, పెండ్రి రమ, మాజీ జెడ్పీటీసీ తగరం సుమలత, మాజీ ఎంపీపీ ఏగోళపు కమల పట్టణంలోని పలు చోట్ల బతుకమ్మల వద్ద ఆడి పాడి సందడిచేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్‌రెడ్డిలు వేర్వురుగా పత్రికా ప్రకటనలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజకు బతుకమ్మ, దసరా పండగల శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ ఆడే కూడళ్ళ వద్ద అధికారులు విద్యుత్‌ ఏర్పాట్లు చేశారు.

జిల్లా కేంద్రంలోని హనుమాన్‌ దేవాలయం, శివాలయం, అమర్‌నగర్‌, బాలాజీనగర్‌, కొంతంవాడ, ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్‌ బండ్‌ వద్దకు బతుకమ్మలను తీసుకువెళ్ళారు. బతుకమ్మ పోయిరావమ్మా అంటూ పాటలు పాడుతూ శ్రీ లక్ష్మీ నీ మహిళలు గౌరమ్మ చిత్రమై పోతురమ్మ గౌరమ్మ అంటూ తీరొక్క పాటలు పాడుతూ పూలవనాన్ని మైమరిపిం చేలా సందడి చేశారు. చివరగా బతుకమ్మలను చెరువుల్లో మహిళలు నిమజ్జనం చేశారు. జెండా కూడలి నుండి ఎల్లమ్మ చెరువు వరకు బీజేపీ, ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆడబిడ్డల ఆత్మీయ పండుగ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Sep 29 , 2025 | 11:57 PM