అరకొరగా పంట రుణాలు
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:24 AM
యేటా రైతులకు ఇచ్చే పంట రుణాలపై భారీగా ప్రణాళికలు ఖరారు చేస్తున్నా బ్యాంకు అధికారులు లక్ష్యాలకు అనుగుణంగా రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదు. ప్రతీ సీజన్‌లో పంట రుణాలు ఇచ్చే విషయమై బ్యాంకు అధికారులు కొర్రీలు విధిస్తుండడంతో విధి లేక రైతులు పంట పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటోంది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
యేటా రైతులకు ఇచ్చే పంట రుణాలపై భారీగా ప్రణాళికలు ఖరారు చేస్తున్నా బ్యాంకు అధికారులు లక్ష్యాలకు అనుగుణంగా రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదు. ప్రతీ సీజన్‌లో పంట రుణాలు ఇచ్చే విషయమై బ్యాంకు అధికారులు కొర్రీలు విధిస్తుండడంతో విధి లేక రైతులు పంట పెట్టుబడుల కోసం ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ఐదేళ్లలో ఇచ్చిన రుణాలు పరిశీలిస్తే 70 శాతానికి మించలేదు. అంటే 30 శాతం మంది రైతులకు పంట రుణాలు అం దడం లేదు. జిల్లాలో సుమారు 2 లక్షల 80 వేల ఎకరాల సాగు భూమి ఉంది. లక్షా 70 వేల మందికి పైగా రైతులు ఉన్నారు. పట్టా భూములు కలిగిన రైతు లకే వాళ్లు వేసే పంటల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను బట్టి పంట రుణా లను అందజేశారు. యేటా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులతో కలిసి రుణ ప్రణాళికలను రూపొందిస్తారు. అందులో భాగంగా వ్యవసాయ పరం గా దీర్ఘకాలిక, స్వల్ప కాలిక రుణాలు ఉంటాయి. పంట రుణాలు స్వల్ప కాలిక రుణాల కింద ఇస్తారు. ఎకరానికి 20 వేల వరకు పంట రుణాన్ని అందజేస్తారు పంట రుణాల కింద రైతుల నుంచి 7 శాతం మాత్రమే వడ్డీ వసూలు చేస్తారు.
అయితే రాష్ట్రంలో ఈ పంట రుణాలను జీరో వడ్డీకే ఇస్తున్నామని ఆయా ప్రభుత్వాలు ప్రకటిస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. రైతులు మాత్రం బ్యాం కు నిబంధనల ప్రకారం పంట రుణాలను చెల్లిస్తున్నారు.
పంట రుణాలు అరకొరే
బ్యాంకు నిబంధనల ప్రకారం వానాకాలం, యాసంగి సీజన్ల వారీగా పంట రుణాలు ఇస్తారు. కానీ జిల్లాలో యేటా వానాకాలం సాగుకు ముందు జూన్, జూలై మాసాల్లోనే పంట రుణాలను తీసుకుంటున్నారు. యాసంగిలో పంట చేతికి వచ్చిన తర్వాత ఏప్రిల్, మే నెలలో రుణాలు చెల్లించి మళ్లీ కొత్తగా రుణాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఐదేళ్లుగా పంట రుణాల లక్ష్యం నెరవేరడం లేదు.
రుణ మాఫీ కారణంగానే
ఆయా ప్రభుత్వాలు పంట రుణాలను ప్రకటించడం వల్లనే లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకు అధికారులు పంట రుణాలు ఇస్తున్నట్లు కనబడడం లేదు. గత ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల వరకు పంట రుణ మాఫీ చేస్తామని, నాలుగేళ్లలో నాలుగు విడతలో రుణ మాఫీ సొమ్మును చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో చాలా మంది రైతులు ముందుగా పంట రుణాలను చెల్లించారు. మరికొంతమంది రైతులు వడ్డీలు చెల్లించి రుణాలను రెన్యూవల్ చేసుకున్నారు కొందరు రైతులైతే విషయం తెలియక రుణాలు చెల్లించ లేదు. ఈ కారణంగా బ్యాంకు అధికారులు పాత బకా యిలు చెల్లిస్తేనే కొత్తగా పంట రుణాలు ఇస్తామని కొర్రీలు విధించారు. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది 2 లక్షల రూపాయల వరకు పంటల రుణమాఫీ ఏకకాలంలో చేసింది. జిల్లాలో 70 శాతానికి పైగా రైతులకు రుణ మాఫీ జరగగా, కొత్తగా తిరిగి పంట రుణాలు తీసుకున్నారు. అయినా కూడా వంద శాతం మంది రైతులకు పంట రుణాలు దక్కలేదు. కనీసం ఈ ఏడాదైనా బ్యాంకు అధికారులు స్పందించి లక్ష్యం మేరకు పంట రుణాలను అందరి రైతులకు ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
ఐదేళ్ళ రుణాలు ఇలా...
సంవత్సరం లక్ష్యం మంజూరు శాతం
(కోట్లలో) (కోట్లలో)
2020-21 1356.25 865.40 63.85
2021-22 1444.73 1007.72 69.75
2022-23 1672.07 1080.73 64.75
2023-24 1854.24 1250.40 67.43
2024-25 1864.83 1256.0 67.35
2025-26 2050 కోట్ల రూపాయల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.