Share News

పటిష్టమైన పోలీసింగ్‌తో నేరాలు తగ్గాయి

ABN , Publish Date - Dec 28 , 2025 | 12:02 AM

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పటిష్టమైన, సమర్థవంతమైన పోలీసింగ్‌తో ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. శనివారం పోలీస్‌ కమిషరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వార్షిక క్రైమ్‌ నివేదికను విడుదల చేశారు.

పటిష్టమైన పోలీసింగ్‌తో నేరాలు తగ్గాయి

కోల్‌సిటీ, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పటిష్టమైన, సమర్థవంతమైన పోలీసింగ్‌తో ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు. శనివారం పోలీస్‌ కమిషరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వార్షిక క్రైమ్‌ నివేదికను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది హత్యలు, దోపిడీలు, ఇండ్లలో దొంగతనాలు, అల్లర్లు, అత్యాచారాలు, హత్యాయత్నాలు వంటి ప్రధాన నేరాలు తగ్గాయన్నారు. కిడ్నాప్‌లు, సాధారణ దొంగతనాలు పెరిగాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నేరాల నియంత్రణకు విజుబుల్‌ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని, నేరాలు జరిగే చోటుకు ఉన్నతాధికారులు పరిశీలనకు వెళ్లడం ద్వారా వాటి పరిష్కారంతో పాటు నేరాల కట్టడికి చర్యలు చేపట్టామన్నారు.

పెట్రోలింగ్‌, ఆకస్మిక వాహనాల తనిఖీ, కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం, ప్రధాన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో అధికారులు, సిబ్బందికి శిక్షణనిప్పించడం ద్వారా ఫింగర్‌ ప్రింట్స్‌, ఇతర ఆధారాల సేకరణ ద్వారా చోరీ సొత్తును రికవరీ చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించామన్నారు. చోరీ కేసుల్లో నిందితులను త్వరగా గుర్తించడం, వారి కదలికలపై నిఘా పెట్టడం, జైలు నుంచి విడుదలైన నేరస్థులపై నిఘా వేయడం ద్వారా ఘటనలను కట్టడి చేశామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజల భాగస్వా మ్యం ముఖ్యమని, ప్రతి కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కెమెరాలు మరమ్మతులో ఉన్నా వాటిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా పరిశ్రమల భాగస్వామ్యంతో సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సీపీ పేర్కొన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 12:02 AM