క్రైమ్ తగ్గింది... రికవరీ పెరిగింది...
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:21 AM
రామగుండం పోలీస్ కమిషరేట్‌లో ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గింది. ఇదే సమయంలో చోరీలు, సైబర్ క్రైమ్‌ల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్మును పోలీసులు రీకవరీ చేయడంలో పురోగతి సాధించారు. గతేడాది 33శాతం రికవరీ ఉంటే ఈ ఏడాది రికవరీ చేశాతం 55కు పెరిగింది.
కోల్‌సిటీ, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రామగుండం పోలీస్ కమిషరేట్‌లో ఈ ఏడాది క్రైమ్ రేట్ తగ్గింది. ఇదే సమయంలో చోరీలు, సైబర్ క్రైమ్‌ల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్మును పోలీసులు రీకవరీ చేయడంలో పురోగతి సాధించారు. గతేడాది 33శాతం రికవరీ ఉంటే ఈ ఏడాది రికవరీ చేశాతం 55కు పెరిగింది. హత్యలు, దొంగతనాలు, చీటింగ్ కేసుల్లో తగ్గుదల నమోదైంది. ఇదే సమయంలో మహిళలకు సంబంధిం చిన మిస్సింగ్‌లు, కిడ్నాప్‌లు పెరిగాయి. గంజాయిని కట్టడి చేయడంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాను నిరోధించగలిగారు. 116కేసుల్లో 318మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2.6క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేయడంతో పాటు కోర్టుల్లో కేసులను నిరూపించడంపై దృష్టి పెట్టారు. 106కేసుల్లో 148మందికి శిక్షలు పడ్డాయి. ఇందులో ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 41కేసుల్లో 59మందికి శిక్షలు పడ్డాయి. ఈ సారి కమిషనరేట్‌లో తరచూ నేరాలకు పాల్పడే వారిపై గ్యాంగ్ ఫైల్‌ను ఓపెన్ చేశారు. ఈ ఏడాది రెండు భారీ కేసులను చేధించారు. సంచలనం సృష్టించిన చెన్నూరు ఎస్‌బీఐ గోల్డ్ లోన్ కేసులో 13మందిని అరెస్టు చేసి 4.2కిలోల బంగారాన్ని స్వాధీనపర్చుకున్నారు. అలాగే మారుమూల ప్రాంతమైన జన్నారంలో సిమ్ బాక్స్ ఏర్పాటు చేసి సైబర్ మోసాలు, అక్రమ టెలీ మార్కెటింగ్, స్పామింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న 10మంది సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
తగ్గిన నేరాలు...
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాల్లో తగ్గుదల కనిపించింది. రిపోర్టు అయిన కేసులు పెరిగినప్పటికీ హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, ఇండ్లలో దొంగతనాలు, హత్యాయత్నాలు, చీటింగ్ వంటి కేసులు తగ్గాయి. గత ఏడాది కమిషనరేట్ పరిధిలో 39మంది హత్యలు జరుగా ఈసారి 30జరిగాయి. ఇందులో పెద్దపల్లి జోన్‌లో 14, మంచిర్యాల జోన్‌లో 16 జరిగాయి. పెద్దపల్లి జోన్‌లో గత ఏడాది 17హత్యలు జరుగగా ఈ సారి 14 జరిగాయి. చీటింగ్ కేసులు గత 693 జరుగగా ఈ సారి 567 మాత్రమే నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చితే 126కేసులు తగ్గాయి. అలాగే రేప్ కేసులు కూడా గత ఏడాది 77 నమోదు అయితే ఈ ఏడాది 56నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో గత ఏడాది 36రేప్ కేసులు నమోదు అయితే ఈసారి వాటి సంఖ్య 21కి తగ్గింది. హత్యాయత్నాలు కూడా గత ఏడాది 91 నమోదు కాగా ఈ ఏడాది 60కి తగ్గాయి.
ఇదే సమయంలో ప్రేమ వ్యవహారాలు, ఇతర విషయాల్లో మిస్సింగ్ కేసులు పెరిగాయి. గత ఏడాది 524 నమోదు అయితే, ఈ ఏడాది 558కి పెరిగాయి. పెద్దపల్లి జిల్లాలో మాత్రం మిస్సింగ్ కేసులు తగ్గాయి. పెద్దపల్లి జిల్లాలో గత ఏడాది 251 జరిగితే ఈ ఏడాది 235 మాత్రమే నమోద య్యాయి. ఇక ముందస్తు అరెస్టులు మాత్రం ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. 2024లో 187ఉంటే ఈ సారి మాత్రం 1022కు పెరిగాయి.
రోడ్డు ప్రమాదాల్లో పెరిగిన మరణాలు...
రామగుండం కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య 763 నమోదయ్యాయి. ఇందులో 258 ఘటనల్లో 273మంది మరణించగా 773మందికి గాయాలయ్యాయి. గత ఏడాది ప్రమాదాల సంఖ్య 755 నమోదు కాగా ఈ ఏసారి 763కు పెరిగాయి. మరణాలు కూడా పది పెరిగాయి. ఇందులో పెద్దపల్లి జిల్లాలో మాత్రం ప్రమాదాల సంఖ్య తగ్గింది. గత ఏడాది 403కేసులు నమోదు కాగా ఈ ఏడాది 334 కేసులు నమోదయ్యాయి. 131మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే ఈ సారి మాత్రం 137మంది మరణించారు. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే రోడ్డు ప్రమాదాల్లో గత ఏడాదితో పోల్చితే ఆరుగురు అధికంగా చనిపోయారు.
దడ పుట్టించిన సంచలన హత్యలు...
ఈ ఏడాది పెద్దపల్లి జిల్లాలో రెండు చోట్ల జరిగిన హత్యలు దడ పుట్టించాయి. పెద్దపల్లి మార్కెట్‌లో పట్టపగలే ఒక వ్యక్తిని వివాహేతర సంబంధం నేపథ్యంలో ఏప్రిల్ 28న అప్పన్నపేటకు చెందిన ధర్మారం మండల దొంగతుర్తి గ్రామానికి చెందిన వ్యక్తి హత్య సంచలనం సృష్టించింది. సుల్తానాబాద్ సమీపంలోని సుగ్లాంపల్లి వద్ద పంచాయితీ విషయంలో తలెత్తిన వివాదంలో ఇద్దరు వ్యక్తులను హత్య చేశారు. ఈ రెండు హత్యలు జిల్లాలో సంచలనం సృష్టించాయి.
గంజాయి కట్టడికి చర్యలు...
కమిషరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో గంజాయి రవాణా, వాడకం గణనీయంగా పెరిగింది. గ్రామాల నుంచి పట్టణాల వరకు అన్నీ ప్రాం తాల్లో గంజాయి లభించే పరిస్థితికి వచ్చింది. దీన్ని కట్టడి చేసేందుకు కమిషనరేట్‌లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రవాణాను కట్టడి చేయాలని నిర్ణయించారు. మొత్తం 116 గంజాయి కేసుల్లో 318మందిని జైలుకు పంపారు. 260కిలోల గంజాయిని స్వాధీన పర్చుకున్నారు. గత ఏడాది 237మందిని అరెస్టు చేస్తే ఈ ఏడాది 318మందిని అరెస్టు చేశారు.
చెన్నూరు బ్యాంకు కేసు చేధించడంలో రికార్డు...
రామగుండం కమిషరేట్ పరిధిలో ఈ ఏడాది వివిధ కేసుల్లో రికవరీ పెరిగింది. చెన్నూరు ఎస్‌బీఐ గోల్డ్‌లోన్ ఆర్థిక మోసం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 360ఖాతాల నుంచి 20కిలోల బంగారు ఆభర ణాలు గల్లంతయ్యాయి. బ్యాంకు అధికారులు, సిబ్బంది మిలాఖత్ అయి తాకట్టు పెట్టిన బంగారాన్ని ప్రైవేట్ గోల్డ్‌లోన్ కంపెనీలకు మళ్లించి కోట్ల రూపాయలు కాజేశారు. కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆధ్వర్యంలో కేసును చేధించి 13మంది నిందితులను అరెస్టు చేయడమే కాకుండా బంగారం మొత్తం రికవరీ చేశారు. అదే విధంగా కమిషరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో రూ.3.53కోట్ల విలువైన బంగారం , నగదు చోరికి గురైతే రూ.1.94కోట్ల రివకవరీ చేశారు. గత ఏడాదితో పోల్చితే 22శాతం రికవరీలో వృద్ధి సాధించారు.
సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి...
కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మారుమూల అటవీ ప్రాంతమైన జన్నారం కేంద్రంగా సైబర్ మోసగాళ్లు సిమ్ బాక్స్ ఏర్పాటు చేసి సైబర్ మోసాలు, అక్రమ టెలీ మార్కెటింగ్, స్పామింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా వలపన్ని 10మందిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 262సిమ్ కార్డులు, ఎలక్ర్టికల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. కమిషరేట్ పరిధిలో 228కేసుల్లో 22మందిని అరెస్టు చేశారు. రూ.3.13కోట్ల సొమ్ము పోగొట్టుకోగా రూ.1.02కోట్ల సొమ్మును రికవరీ చేశారు.
106కేసుల్లో 148మందికి శిక్షలు
కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదు చేయడమే కాకుండా వారికి శిక్షలు పడడంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో 106కేసుల్లో 148మందికి శిక్షలు పడ్డాయి. ఐదు కేసుల్లో ఏడుగురికి జీవిత ఖైదు, ఒకరికి 20ఏళ్లు, మరొకరికి 17ఏళ్ల శిక్షలు పడ్డాయి. మూడు కేసుల్లో ఐదుగురికి ఏడేళ్లు జైలు శిక్షలు పడ్డాయి. ఏడాది లోపు 32మందికి శిక్షలు పడ్డాయి. అలాగే ఈ సారి వరుసగా నేరాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసులు గ్యాంగ్ షీట్లు తెరిచారు. కమిషరేట్ పరిధిలో 107మందిపై హిస్టరీ షీట్లు, 42మందిపై రౌడీ షీట్లు, 65మందిపై సస్పెక్టు షీట్లు తెరిచారు. తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 38మందిపై గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేశారు.