జిల్లాలో 48 వేల ఎకరాల్లో పత్తి సాగు
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:48 PM
జిల్లాలో 48వేల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారని, తద్వారా 5.5 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందనే అంచనా వేసిన ట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్ రెడ్డి అన్నారు. చిన్నకల్వలలోని శ్రీవెంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్‌రావుతో కలిసి సోమవారం ప్రారంభించారు.
సుల్తానాబాద్, నవంబరు3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 48వేల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారని, తద్వారా 5.5 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందనే అంచనా వేసిన ట్లు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్ రెడ్డి అన్నారు. చిన్నకల్వలలోని శ్రీవెంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్‌రావుతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో నాలుగు జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, పత్తి కొనుగోళ్ల కోసం నాలుగు సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించగా మొదటగా చిన్నకల్వలలో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని రాఘవాపూర్, నిట్టూరు నిమ్మనపల్లి, కమాన్‌పూర్ మండలం గొల్లపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నియమ నిబంధనల మేరకు సెంటర్లకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. తేమ 8 శాతం ఉన్న పంటకు కేంద్ర ప్రభుత్వం రూ.8111 క్వింటాల్‌కు ప్రకటించిందన్నారు. కాపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొని పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ తీసుకురావాల్సి ఉంటుందన్నారు. తేమ శాతం 12కు మించితే కేంద్రాలలో కొనుగోలు చేయరన్నారు. కౌలు రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి, దానికి సంబంధించిన పత్రాలు తీసుకురావాలన్నారు. మాజీ ఎంపీటీసీ పన్నాల రాములు, జైపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బక్కయ్య, లక్ష్మినారాయణ, మాజీ సర్పంచ్ పన్నాల తిరుపతి, ఏడుకొండ రమేష్, తిరుపతి, మార్కెట్ కార్యదర్శి మనోహర్, సీసీఐ అధికారి భరత్, మండల వ్యవసాయ అధికారి పైడితల్లి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.