Share News

‘శాతవాహన’లో అవినీతి బాగోతం

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:02 AM

శాతవాహన యూనివర్సిటీలో అవినీతి బాగోతం కొనసాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. అధికారులే సూత్రధారులుగా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. యూనివర్సిటీ పరిపాలన విభాగం నిర్వహించే భవనం మొదటి అంతస్తు నిర్మాణం కోసం ఏడు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి.

‘శాతవాహన’లో అవినీతి బాగోతం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

శాతవాహన యూనివర్సిటీలో అవినీతి బాగోతం కొనసాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. అధికారులే సూత్రధారులుగా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నది. యూనివర్సిటీ పరిపాలన విభాగం నిర్వహించే భవనం మొదటి అంతస్తు నిర్మాణం కోసం ఏడు కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. గత వీసీ హయాంలో ఈ నిధులు మంజూరు కాగా భవన నిర్మాణ అంచనాలను తొమ్మిది కోట్లకు పెంచి పనులు చేపట్టి పూర్తి చేశారు. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని, అంచనాలు అక్రమంగా పెంచేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఆనాటి వైస్‌ చాన్స్‌లర్‌, రిజిస్ర్టార్‌, ఇతర సిబ్బందిపై విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఒకవైపు ఈ విచారణ కొనసాగుతుండగానే ఆ పరిపాలన భవనాన్ని ఇటీవల రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. భవన నిర్మాణంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతుండగా మంత్రి దీనిని ప్రారంభించడం క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇష్టారాజ్యంగా నియామకాలు

ఇటీవల యూనివర్సిటీలో ముగ్గురు కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఒక ల్యాబ్‌ అసిస్టెంట్‌, రెండు సెక్యూరిటీ గార్డు పోస్టులను నోటిఫికేషన్‌ లేకుండానే భర్తీ చేశారని, ఈ విషయంలో ఒకరిద్దరు అధికారులు కొందరు నిరుద్యోగుల వద్ద డబ్బులు దండుకుని నోటిఫికేషన్‌ లేకుండా నియామకాలు చేశారనే విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీ లా కళాశాలకు 14 బోధన సిబ్బంది, 19 బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరయ్యాయి. హుస్నాబాద్‌లో ప్రారంభించిన ఇంజనీరింగ్‌ కళాశాలకు 54 బోధన సిబ్బంది పోస్టులు, 33 బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరయ్యాయి. వీటిని నోటిఫికేషన్‌ లేకుండానే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. ఇంజనీరింగ్‌ కళాశాల పోస్టుల్లో కొన్నింటికి ఇప్పటికే ఇంటర్వ్యూలు నిర్వహించారని, దీనికి 130 మందికిపైగా హాజరయ్యారని సమాచారం. కొందరికి నామమాత్రంగా ఇంటర్వ్యూ నిర్వహించారని, ముందుగా ఆ పోస్టుల్లో తీసుకున్న కొందరిని ఇంటర్వ్యూల పేరిట భర్తీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

పరీక్ష పత్రాల మూల్యాంకనంలో..

గత వీసీ హయాంలో పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కోసిన్‌ అనే సంస్థకు అప్పగించారు. టెండరు లేకుండానే పరీక్షల కంట్రోలర్‌, రిజిస్ర్టార్లు ఈ వ్యవహారం నడిపించారనే విమర్శలు వచ్చాయి. మొదట 11 రూపాయలకు ఒక పేపర్‌ వాల్యుయేషన్‌ చేసేందుకు ఒప్పందం కుదరగా, ఆ తర్వాత దానిని 14 రూపాయలకు, ఆరు నెలల్లోనే 22 రూపాయలకు పెంచారు. ఈ వ్యవహారంలో కూడా లక్షల రూపాయల్లో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

అభివృద్ధి అంతంతే...

శాతవాహన యూనివర్సిటీ 17 సంవత్సరాల క్రితం ప్రారంభమైనా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. యూనివర్సిటీలో 114 మంది బోధన, బోధనేతర సిబ్బంది అవసరం ఉండగా 63 మందితోనే నెట్టుకు వస్తున్నారు. ఇందులోనూ రెగ్యులర్‌ ఉద్యోగులు 16 మంది మాత్రమే ఉన్నారు. ఇద్దరు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు రెగ్యులర్‌ పోస్టుల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలో 10 ప్రొఫెసర్‌ పోస్టులు, 16 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 21 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కాంట్రాక్టు, పార్ట్‌టైం, గెస్ట్‌ ఫ్యాకల్టీ పద్ధతిలో 47 మంది పనిచేస్తున్నారు. 51 మంది బోధనేతర సిబ్బంది అవసరం ఉండగా తొమ్మిది మందితోనే నెట్టుకు వస్తున్నారు. 42 పోస్టుల్లో తాత్కాలిక సిబ్బంది పని చేస్తున్నారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ఒక ప్రొఫెసర్‌, ఇద్దరు అసిసోసియేట్‌ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. ఏ ఒక్క డిపార్ట్‌మెంట్‌లోనూ పూర్తిస్థాయిలో సిబ్బందిలేరు. 170 మంది ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు.

సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులతో విద్యార్థులపై భారం

ఫుడ్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాలు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులుగా నడుస్తున్నాయి. వీటిని రెగ్యులర్‌ కోర్సులుగా మార్చాలని విద్యార్థులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రెగ్యులర్‌ కోర్సులుగా నడుస్తున్న తెలుగు, ఆంగ్లం, బాటనీ, మాథమెటిక్స్‌ విభాగాలను యూజీసీ-12బి గుర్తింపు వచ్చిన తర్వాత 2022 జూన్‌ నుంచి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులుగా మార్చారు. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు విడుదలకాకపోవడంతో విద్యార్థులకు పరిశోధన, ఫెలోషిప్స్‌, ప్రాజెక్టులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా శాతవాహన యూనివర్సిటీపై దృష్టిసారించి నిధుల విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ యూనివర్సిటీ అభివృద్ధిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 01:02 AM