నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:40 PM
మండలంలో నిర్మాణంలో ఉన్న పాఠశాలలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు.
కాల్వశ్రీరాంపూర్, జూలై 18(ఆంధ్రజ్యోతి): మండలంలో నిర్మాణంలో ఉన్న పాఠశాలలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. అంకంపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, అంగన్‌వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మడిపల్లిలోని ఎంపీపీఎస్, నిర్మాణంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల, ఊషన్నపల్లిలోని ప్రైమరీ పాఠశాల, మొట్లపల్లి, కిష్టంపేటలో పలు ప్రభుత్వ పాఠశాలలు, మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలను పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ అంకంపల్లిలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. వీటికోసం అధికారులు పూర్తి స్థాయిలో సహకరించాలని, ఇండ్ల నిర్మాణ పురోగతి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. మడిపల్లి, ఊషన్నపల్లి గ్రామాల్లోని పాఠశాలల నిర్మాణ పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మడిపల్లి పాఠశాలలో ప్రహరీ, గ్రౌండ్ లెవల్ పనులు చేపట్టాలన్నారు. అనంతరం మొట్లపల్లి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటారు. పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాలని పాఠశాలల ప్రాంగణాలు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఎంపీడీఓ పూర్ణచందర్ రావు, ఎంపీఓ ఆరీఫ్, పంచాయతీ రాజ్ ఏఈ శ్రవణ్, ఎంఈఓ మహేష్ తదితరులు ఉన్నారు.