కారుణ్య నియామకాల రద్దుకు కుట్ర
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:32 AM
సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే కుట్ర జరుగుతుందని, రెండు సంవత్సరాలుగా మెడికల్ బోర్డుకు వెళుతున్న కార్మికులను అన్‌ఫిట్ చేయకుండా యాజమాన్యం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
గోదావరిఖని, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): సింగరేణిలో కారుణ్య నియామకాలను రద్దు చేసే కుట్ర జరుగుతుందని, రెండు సంవత్సరాలుగా మెడికల్ బోర్డుకు వెళుతున్న కార్మికులను అన్‌ఫిట్ చేయకుండా యాజమాన్యం కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. శనివారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ఆర్‌జీ-1 ఉపాధ్య క్షుడు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఉన్న మెడికల్ బోర్డును నిర్వీర్యం చేస్తూ కార్మికులను అన్‌ఫిట్ చేయడం లేదని, తొమ్మిది నెలలుగా మెడికల్ బోర్డు పెట్టడం లేదన్నారు. మొక్కుబడిగా పెట్టిన రెండు మెడికల్ బోర్డులో కొందరికే మెడికల్ అన్‌ఫిట్ చేశారని, మిగతా కార్మికులకు అన్యాయం చేశారన్నారు. కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో సింగ రేణి కార్మికులు అడుగకుండానే హక్కులను కల్పించారని, కాంగ్రెస్ సర్కార్ కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. 2023-24 ఆర్థిక సం వత్సరానికి సింగరేణి వాస్తవ లాభాల్లో కేవలం 16శాతం వాటానే ఇచ్చి కార్మికులను మోసం చేసిందని, అభివృద్ధి పేరిట రూ.2,289 కోట్లు పక్కన పెట్టిందని, కార్మికులకు ఆదాయ పన్ను మినహాయించి అల వెన్సులపై ఆదాయ పన్నును యాజమాన్యమే భరించాలని డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ నెలకు రెండు బోర్డులను నిర్వహించి అనారోగ్యంతో ఉన్న కార్మికులందరిని అన్‌ఫిట్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధు, నాయకులు కౌశిక హరి, సురేందర్‌రెడ్డి, కాపు కృష్ణ, మాదాసు రామమూర్తి, నూనె కొమురయ్య, పర్లపల్లి రవి, చెల్పూరి సతీష్, సాంబయ్య, బడికెల సంపత్, ఐలి శ్రీనివాస్, ఐ సత్యం, పొలాడి శ్రీనివాసరావుతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.