Share News

నేడు కాంగ్రెస్‌ జనహిత పాదయాత్ర

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:03 AM

కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన జనహిత పాదయాత్ర ఆదివారం జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో జరగనున్నది. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ చేస్తున్న ఈ పాదయాత్రకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

నేడు కాంగ్రెస్‌ జనహిత పాదయాత్ర

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన జనహిత పాదయాత్ర ఆదివారం జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో జరగనున్నది. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ చేస్తున్న ఈ పాదయాత్రకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రస్తుత ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మాజీ ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ఉమ్మడి జిల్లా పరిధిలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇతర ముఖ్య నేతలందరూ ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు వీరంతా గంగాధర మండలం కురిక్యాలకు చేరుకుంటారు. కురిక్యాలలో జెండా ఎగురవేసిన అనంతరం వాహనాల్లో ఉప్పరమల్యాలకు వెళ్తారు. అనంతరం అక్కడ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు సమర్పించి పాదయాత్రగా బయల్దేరి కురిక్యాల మీదుగా 5 కిలోమీటర్లు యాత్ర నిర్వహించి మధురానగర్‌ చేరుకుంటారు. అక్కడ జరిగే రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. రాత్రి అదే గ్రామానికి చెందిన మ్యాక వినోద్‌ అనే దళిత నాయకుడి ఇంట్లో అందరూ బస చేస్తారు. సోమవారం గంగాధర మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్‌ హాస్టల్‌లో శ్రమదానం చేస్తారు. శ్రమదానం అనంతరం వెంకటాయపల్లికి చేరుకుని అక్కడ ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ నేతలు, శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. ప్రతి ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక నియోజవకర్గంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా చొప్పదండిలో దీనిని ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులు, ప్రజాప్రతినిధులందరూ ఈ యాత్రలో పాల్గొంటారు. గడిచిన 19 నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి వాటి ఫలితాలు అందుతున్న తీరుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు ఇంకా వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న అంశాల గురించి విచారిస్తారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ ప్రత్యేకంగా మహిళలతో కలుస్తారని, వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ అద్దె బస్సులు, ఎలక్ర్టిక్‌ బస్సులు, ఇందిరా క్యాంటీన్లు నిర్వహిస్తున్న మహిళలతో చర్చిస్తారని పార్టీ ప్రకటించింది. ప్రధానంగా గ్రామస్థాయిలో ప్రభుత్వం పనితీరుపై, పార్టీ నేతలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తెలుసుకుని లోటుపాట్లను సవరించుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వీటన్నింటినీ చక్కదిద్దుకుని క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసే లక్ష్యంగా ఈ పాదయాత్ర జరుగుతున్నదని తెలుస్తున్నది.

ఫ పార్టీ పరిస్థితిపై క్షేత్ర స్థాయిలో దృష్టి

జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం నామినేటెడ్‌ పదవులు భర్తీ కాకపోవడం, పార్టీ కమిటీల్లో కూడా చాలాకాలంగా పనిచేస్తున్న వారికి అవకాశాలు కల్పించే చర్యలు చేపట్టకపోవడంతో పార్టీ శ్రేణుల్లో, ద్వితీయ శ్రేణి నాయకుల్లో నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయి. పలు ఎంక్వైరీలు నిర్వహించి ఆయా పదవుల్లో నియమించడానికి నేతల పేర్లతో జాబితాలు రూపొందించి పీసీసీకి చేర్చినా వాటిపై ఇంకా పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో శ్రేణుల్లో పనిచేయడానికి ఉత్సాహం లేకుండా పోయిందని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అసంతృప్తిని తొలగించే విధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పార్టీ సమావేశంలో తమ ప్రణాళికను ప్రకటిస్తారని తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమై జిల్లాలో నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఇక్కడ జరిగే సమావేశంలో పార్టీ క్షేత్రస్థాయి నేతల నుంచి వచ్చే ప్రతిపాదనలను కూడా విని పరిశీలించి ఆ దిశగా చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి త్వరలోనే ఆర్థిక, రోడ్లు, భవనాల శాఖ, నీటి పారుదల శాఖ మంత్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ముఖ్యమైన సమస్యలు పరిష్కరించేందుకు ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక, నీటి పారుదల శాఖ మంత్రులు ఈ పాదయాత్రలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. జిల్లాలోని కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్న పురుమల్ల శ్రీనివాస్‌ను పార్టీ సస్పెండ్‌ చేసింది. ఆయన స్థానంలో ఇన్‌చార్జిగా ఎవరిని నియమించలేదు. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు ఎవరు నిర్వహించాలన్నది సమస్యగా మారింది. నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకం విషయంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబులకు మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణంగా పేర్కొంటున్నారు. ఈ సమావేశంలో ఇది కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నది. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం పెండింగ్‌ పడిపోయింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్ల నిర్మాణాలు చేపట్టి వేగంగా పనులు కొనసాగుతున్నా ఈ నియోజకవర్గంలో మాత్రం ఆ పరిస్థితి లేకపోవడంతో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న పేద, దిగువ మధ్య తరగతి ప్రజల్లో అసంతృప్తి, అసహనం పెరిగిపోతున్నది. ఈ అంశం కూడా పార్టీ పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Updated Date - Aug 24 , 2025 | 01:03 AM