పంచాయతీ ఎన్నికలపై అయోమయం
ABN , Publish Date - May 12 , 2025 | 12:45 AM
స్థానిక పోరు ఇప్పట్లో రానంటున్నాయ్.. ఒకవైపు ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సర్వం సన్నద్ధమైన సామాజికవర్గాల రిజర్వేషన్లు బ్రేక్ వేస్తున్నాయి. ప్రధానంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పంచాయతీ తేలే వరకు స్థానిక ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్నికలను ఊరిస్తూ వాయిదాలు వేస్తోంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
స్థానిక పోరు ఇప్పట్లో రానంటున్నాయ్.. ఒకవైపు ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సర్వం సన్నద్ధమైన సామాజికవర్గాల రిజర్వేషన్లు బ్రేక్ వేస్తున్నాయి. ప్రధానంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పంచాయతీ తేలే వరకు స్థానిక ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్నికలను ఊరిస్తూ వాయిదాలు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం జనగణనతోపాటు కులగణన కూడా చేపట్టే అవకాశాలు ఉండడంతో గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే అని అభిప్రాయంతో ఆశావహులు నిరాశ చెందుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచేందుకు సవరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. సవరణ కావాలంటే పార్లమెంట్‌లో బిల్లు పాస్ చేయాల్సి ఉంటుంది. కేంద్రం ఈ ప్రక్రియ ఇంకా మొదలు పెట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జూలైలో ఎన్నికలంటూ ఆశలు కల్పిస్తున్నారు. దీంతో ఎలక్షన్ల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులు అయోమయంలో పడ్డారు. 2024జనవరి నెలలో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ కాలం ముగిసినా ఎన్నికలపై ఇప్పటికీ గందరగోళ పరిస్థితి వీడటం లేదు. ప్రస్తుత రిజర్వేషన్ల పరిస్థితుల్లో మరో ఆరు నెలల పాటు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అంటూ అధికారులు ఆశావహులు ఉన్నారు. అధికార యంత్రాంగం ఓటర్ జాబితాతో పాటు ఇతర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల కమిషన్ గుర్తులతో పాటు సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. కానీ ఆశావహులకు ఎదురుచూపులు మాత్రం తప్పడం లేదు.
- నోటిఫికేషన్ రావడమే తరువాయి..
రాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం చెప్పినట్లు జూలైలో ఎన్నికల వచ్చిన అధికార యంత్రాంగం మాత్రం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధంగా ఉన్నారు. 2019 గ్రామపంచాయతీ ఎన్నికలు రాజన్నసిరిసిల్ల జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించింది. ఈసారి కూడా మొదట్లో మూడు విడతలుగా ఏర్పాటు చేసినా రెండు విడతల్లోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించడం దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 260 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో మొదటి విడతలో 137 సర్పంచ్‌లు, 1,888 వార్డులు, రెండో దశలో 123 గ్రామాలు, 1,080 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేశారు.
- ఓటరు జాబితా రెడీ...
జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు కీలకంగా ఉండే ఓటరు జాబితాను సిద్ధం చేశారు. 260 గ్రామపంచాయతీల్లో మూడు లక్షల 46 వేల 259 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఇందులో పురుషులు 1,67,686 మంది, మహిళలు 1,78,553 మంది, 20 మంది ట్రాన్స్‌జెండర్ ఓట్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. 200 మంది ఓటర్లు ఉన్న చోట ఒక ప్రీసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారి ఉంటారు. 201 నుంచి 400 వరకు ఒక ప్రీసైడింగ్ అధికారి ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 650 వరకు ఉండే పోలింగ్ కేంద్రంలో ప్రీసైడింగ్ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించనున్నారు. జిల్లాలో 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్ కేంద్రాలు, 134 ఉండగా, 400 ఓటర్లు ఉన్న కేంద్రాలు 468 ఉండగా, 650 ఓటర్లు ఉన్నవి 76 కేంద్రాలు ఉన్నాయి.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 గుర్తులు కేటాయించారు. సర్పంచ్‌లకు సంబంధించి పింక్ కలర్ బ్యాలెట్ పత్రం, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్‌ల ఎన్నికల గుర్తుల్లో ఉంగరం, కత్తెర, పుట్‌బాల్, బ్యాట్, బ్యాట్స్‌మెన్, స్టంప్స్, లేడీ పర్స్, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, పాన్, చెత్తడబ్బా, బెండకాయ, కొబ్బరి చెట్టు, వజ్రం, నల్ల బోర్డు, బకెట్, డోర్ హ్యాండిల్, చేతికర్ర, మంచం, బిస్కెట్, వేణువు, జల్లెడ, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, పడవ, చైన్, చెప్పులు, గాలిబుడగ, తదితర గుర్తులు ఉన్నాయి. వార్డు సభ్యులకు సంబంధించి పొయ్యి, స్టూల్, బీరువా, గ్యాస్ సిలెండర్, గౌన్, ఈల, కుండ, గరాట, ముకుడు, డిష్ ఏంటీనా, ఐస్‌క్రీమ్, గాజు గ్లాస్, పోస్ట్ డబ్బా, కవర్, కటింగ్ ప్లేయర్, హాకీ, కర్రబంతి, నైక్ టై, విద్యుత్ స్థంబం, షటిల్, గుర్తులు కేటాయించారు. గుర్తుల్లో కొన్ని గుర్తుంచుకోవడం కష్టమే అన్నట్లుగా భావిస్తున్నారు.
జిల్లాలో పురుషులు, మహిళల ఓట్లు
మండలం పురుషులు మహిళలు మొత్తం
బోయినపల్లి 14,681 15,595 30,276
చందుర్తి 13,220 14,394 27,614
ఇల్లంతకుంట 19,391 20,512 39,903
గంభీరావుపేట 17,543 18,639 36,183
కోనరావుపేట 16,795 17,666 34,461
ముస్తాబాద్ 18,529 19,613 38,142
రుద్రంగి 6,234 7,006 13,243
తంగళ్లపల్లి 18,372 19,432 37,804
వీర్నపల్లి 5,713 5,836 11,549
వేములవాడ 8,877 9,296 18,189
వేములవాడరూరల్ 8,914 9,699 18,613
ఎల్లారెడ్డిపేట 19,417 20,865 40,282
-------------------------------------------------------------------------------
మొత్తం 1,67,686 1,78,553 3,46,259 (ఇతరులు 20)
--------------------------------------------------------------------------------