Share News

నైనీ నుంచి తమిళనాడు జెన్‌కోకు బొగ్గు సరఫరా

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:14 PM

సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ నుంచి తమిళనాడు పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌కు బొగ్గును సరఫరా చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈ బ్లాక్‌ నుంచి యేటా 2.88మిలియన్‌ టన్నుల బొగ్గు సరఫరాకు తమిళనాడు జెన్‌కోతో సింగరేణి సంస్థ మరో 10రోజుల్లో ఇంధన సరఫరా ఒప్పందం చేసుకోనుంది.

నైనీ నుంచి తమిళనాడు జెన్‌కోకు బొగ్గు సరఫరా

గోదావరిఖని, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ నుంచి తమిళనాడు పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌కు బొగ్గును సరఫరా చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈ బ్లాక్‌ నుంచి యేటా 2.88మిలియన్‌ టన్నుల బొగ్గు సరఫరాకు తమిళనాడు జెన్‌కోతో సింగరేణి సంస్థ మరో 10రోజుల్లో ఇంధన సరఫరా ఒప్పందం చేసుకోనుంది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌ సింగరేణి భవన్‌లో తమిళనాడు పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ఎండీ గోవిందరావు సింగరేణి సీఎండీ ఎన్‌ బలరామ్‌ను కలిసి చర్చలు జరిపారు. తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా ఉడింగిడిలో ఉన్న 1200 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ కోసం ప్రతీ ఏడాది 2.88మిలియన్‌ టన్నుల జీ-11 బొగ్గు అవసరముందని జెన్‌కో ఎండీ గోవిందరావు పేర్కొన్నారు. సింగరేణి నుంచి ఈ బొగ్గును సరఫరా చేయాల్సిందిగా కోరారు. దీనిపై సింగరేణి సీఎండీ స్పందిస్తూ ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ నుంచి ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో రైలు, జల మార్గంలో సరఫరా చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు బొగ్గు సరఫరాకు ఏర్పాట్లు చేయాలని నైనీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో తమిళనాడు జెన్‌కోతో మరో 10రోజుల్లో ఇంధన సరఫరా ఒప్పందం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని బొగ్గు రవాణా, మార్కెటింగ్‌ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. సింగరేణితో తమిళనాడు జెన్‌ కోకు ఉన్న దీర్ఘకాలిక బంధాన్ని మరింత బలపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని సీఎండీ బలరామ్‌, తమిళనాడు జెన్‌కో ఎండీ గోవిందరావు పేర్కొన్నారు. ఇప్పటికే సింగరేణి ద్వారా తమిళనాడు లోని నార్త్‌ చెన్నై విద్యుత్‌ ప్లాంటుకు యేటా 1.75 మిలియన్‌ టన్నుల బొగ్గు సరఫరా జరుగుతుంది. తాజాగా ఒడిశాలోని నైనీ ప్రాజెక్టు నుంచి ఏడాదికి 2.88 మిలియన్‌ టన్నుల బొగ్గు సరఫరాకు అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో నైనీ బొగ్గుకు మొదటి వినియోగదారుగా తమిళనాడు నిలవనున్నది. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(కోల్‌ మూమెంట్‌) బి వెంకన్న, జీఎం(కో ఆర్డినేషన్‌, మార్కెటింగ్‌) టీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2025 | 11:14 PM