Share News

యథేచ్ఛగా చిట్‌ఫండ్స్‌ మోసాలు

ABN , Publish Date - Sep 07 , 2025 | 01:26 AM

జిల్లాలో చిట్‌ఫండ్స్‌ అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జీరో చిట్స్‌ దందాను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన చిట్‌ రిజిస్ట్రార్‌ శాఖ పట్టించుకోకపోవడంతో చిట్‌ సభ్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శేలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య, మద్యతరగతికి చెందినవారు నెలనెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసి చిట్స్‌ వేస్తుంటారు.

యథేచ్ఛగా చిట్‌ఫండ్స్‌ మోసాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో చిట్‌ఫండ్స్‌ అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జీరో చిట్స్‌ దందాను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన చిట్‌ రిజిస్ట్రార్‌ శాఖ పట్టించుకోకపోవడంతో చిట్‌ సభ్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శేలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య, మద్యతరగతికి చెందినవారు నెలనెలా కొంత మొత్తాన్ని పొదుపు చేసి చిట్స్‌ వేస్తుంటారు. అవసరాలకు ఉపయోగపడతాయని ఆశించి చిట్స్‌లో చేరిన సభ్యులకు ్స డబ్బులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సందర్భాల్లో ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అధికవడ్డీకి అప్పుగా డబ్బులు తీసుకుని చెల్లించలేక ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. ఫలానా చిట్‌ఫండ్స్‌లో మోసం జరిగిందని, తనకు రావాల్సి డబ్బులు సకాలంలో చెల్లించడం లేదని ఎవరైనా చిట్‌ రిజిస్ట్రార్‌ అధికారుల వద్దకు వెళితే కనీసం ఫిర్యాదు తీసుకోవడం లేదని, ఫిర్యాదు చేస్తే ఏమొస్తుంది? వారితో మాట్లాడిస్తా.. పరిష్కరించుకో అని ఉచిత సలహా ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

బోర్డు తిప్పేస్తున్న సంస్థలు

కరీంనగర్‌లో గడిచిన ఐదేళ్లలో అభయమిత్ర, పదికిపైగా రిజిష్టర్డ్‌ చిట్‌ఫండ్స్‌ బోర్డు తిప్పేయడంతో సభ్యులు 10 నుంచి 20 కోట్ల వరకు నష్ట పోయారు. బాధితులు అప్పట్లో కరీంనగర్‌ చిట్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. పైగా దీనిలో తాము చేసేది ఏమీ లేదని, చిట్‌ఫండ్స్‌కు సభ్యులకు మద్యవర్తిగా వ్వహరించడం తప్ప ఏమీ చేయలేమని నిస్సిగ్గుగా చెప్పడం గమనార్హం. కొన్ని సంఘటనల్లో రిజిష్టర్డ్‌ చిట్స్‌ కానందున తాము చర్యలు తీసుకునే అవకాశం లేదని తప్పించుకుంటున్నారు. చిట్‌ఫండ్స్‌లో రిజిష్టర్డ్‌ చిట్స్‌ నడుస్తున్నాయా? జీరో చిట్స్‌ నడుస్తున్నాయా? అనేది అధికారులు పర్యవేక్షించి చిట్స్‌ సభ్యులకు నష్టం కలుగకుండా చూడాల్సిందిపోయి జీరో చిట్స్‌లో సభ్యులకు ఏ విధంగా న్యాయం చేస్తామని అనడం ఎంత వరకు సబబని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చిట్స్‌ రిజిస్ట్రార్‌ అధికారులు పర్యవేక్షణ నిబద్ధతగా ఉంటే ఈ జీరో చిట్స్‌ అనేవి ఉండకుండా పోతాయి. దీంతో చిట్‌ సభ్యులు మోసాలకు గురికాకుండా ఉంటారు. కరీంనగర్‌లోని కొన్ని బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్స్‌కు సంబంఽధించిన చిట్‌ మార్ట్‌గేజ్‌ ఆస్తులను రిలీజ్‌లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయి. చిట్‌ గ్రూపులోని మొత్తం సభ్యులకు చిట్‌ డబ్బులు చెల్లించిన తరువాతనే ఆ గ్రూపు పేరిట ఉన్న నగదు రూపంలో ఉన్న డిపాజిట్‌ లేదా ఆస్తి మార్ట్‌గేజ్‌ను తిరిగి చిట్‌ఫండ్స్‌కు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో చిట్‌ఫండ్స్‌ నిర్వాహకులతో కుమ్మక్కైన అధికారులు చిట్‌ సభ్యులందరికి చిట్‌ డబ్బులు చెల్లించకుండానే మార్ట్‌గేజ్‌ను రిలీజ్‌ చేశారు. చిట్‌ఫండ్స్‌ నిర్వాహకులతో కుమ్మక్కైన చిట్‌ రిజిస్ట్రార్‌ అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతుండడంతో సభ్యులుగా చేరిన సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు బలి పశువులవుతున్నారు. ఇక గ్రామాలు, పట్టణాల్లో రోజుకో చిట్టీల నిర్వాహకులు చేతులెత్తేసి ఐపీ (ఇన్‌సాల్‌వెన్సీ పిటిషన్‌)లు పెడుతుంటే అధికారులు బాధితులను పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

నిబంధనల ఉల్లంఘన

చిట్‌ఫండ్స్‌, ఫైనాన్స్‌ల నిర్వహణ, లావాదేవీలను చట్ట బద్దం చేయడానికి రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ కార్యాలయం పని చేస్తుంటుంది. చిట్‌ఫండ్స్‌లో నిర్వహించే అన్ని చిట్స్‌ను చట్టబద్దం చేయడానికి ప్రత్యేకంగా జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒక చిట్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఉన్నారు. జిల్లాలోని అన్ని చిట్‌ఫండ్స్‌, ఫైనాన్స్‌లలో ఆర్థికలావాదేవీలు చట్టబంద్దంగా జరిగే విధంగా ఈ చిట్స్‌ సబ్‌రిజిస్ట్రార్‌ బాధ్యత. రెగ్యులర్‌గా చిట్‌ఫండ్స్‌ లావాదేవీలను తనిఖీలు చేసి అక్రమాలు చోటు చేసుకుంటే ఆ సంస్థ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయడమే కాకుండా సంస్థకు చెందిన ఆస్తులను సీజ్‌ చేసే, బాధితులకు చెల్లించే విధంగా న్యాయం అందించే అధికారం చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌కు, జిల్లా రిజిస్ట్రార్‌లకు ఉంటుంది. జిల్లాలో జరుగుతున్నది అందుకు విరుద్దంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా వందకుపైగా చిట్‌ఫండ్స్‌ సంస్థలున్నాయి. ఈ చిట్‌ఫండ్స్‌లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి లావాదేవీలకు చట్టబద్ధత కల్పించే బాధ్యత చిట్స్‌ అసిస్టెంట్‌రిజిస్ట్రార్‌ అధికారులదే. కాని ఏనాడు జిల్లాలోని ఏ ఒక్క చిట్‌ఫండ్స్‌లకు తనిఖీల కోసం వెళ్లడం లేదు. చిట్‌ఫండ్స్‌ నిర్వాహకులే ప్రతి నెల వారి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాలను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌ కార్యాయలం తీసుకువచ్చి తాము రిజిష్టర్‌ అయిన చిట్స్‌నే నడుపుతున్నామని మినిట్స్‌ సమర్పిస్తున్నారు. ఈ రికార్డులతోపాటే ప్రతినెలా క్రమం తప్పకుండా మామూళ్లు ముట్టజెబుతున్నారనే విమర్శలున్నాయి. అధికారికంగా నామమాత్రపు చిట్స్‌ను రిజిష్టర్డ్‌గా పేర్కొంటున్న ఈ చిట్‌ఫండ్‌ సంస్థలు అంతకు రెట్టింపు సంఖ్యలో జీరో చిట్స్‌ను నడుపుతున్నాయి. ఈ విషయం చిట్స్‌ డబ్బులను సభ్యులకు చెల్లించే సమయంలో వచ్చిన తేడా సందర్భంలో బయటపడుతున్నాయి. అప్పుడు అధికారులే బాధ్యులను ఎదురు ప్రశ్నిస్తున్నారు. రిజిస్టర్డ్‌ చిట్‌ నిర్ధారించుకోకుండా ఎలా చిట్‌ సభ్యుడిగా చేరావు? అని ప్రశ్నిస్తూ బాధితులను ఫిర్యాదు చేయకుండా అడ్డుకుంటున్నారు.

ఫ డబ్బులు చెల్లించకుండా వేధింపులు

చిట్‌ వేలం పూర్తి చేసిన తరువాత 45 రోజుల్లో చిట్‌ డబ్బులు సభ్యుడికి చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు ష్యూరిటీలు, ఐటీ రిటర్న్స్‌, ఇతర ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ కాలయాపన చేస్తున్నారు. అవసరమైన అన్ని పత్రాలు, సంతకాలు తీసుకురావాలని చెప్పకుండా ఉద్దేశపూర్వకంగా ఒకటి తరువాత మరొకటి పత్రం కావాలంటూ నెలలు గడుపుతూ మూడు నెలల నుంచి నాలుగు నెలల వరకు చిట్‌ డబ్బులు చెల్లించడం లేదని పలువురు త చిట్‌ సభ్యులు వాపోతున్నారు. కరీంనగర్‌ చిట్‌ రిజిస్ట్రార్‌ పోస్టు ఏడాదికాలంగా ఖాళీగానే ఉంది. ఇన్‌చార్జితో వెళ్ళదీస్తున్నారు.

కమిషనరేట్‌ పరిధిలో కేసులు

2024లో ఏడాది కాలంలో చిట్‌ఫండ్స్‌ నిర్వాహకులు చిట్‌ సభ్యులకు చిట్‌ డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పడిన, వేధింపులకు గురి చేసిన ఘటనలపై కమిషనరేట్‌ వ్యాప్తంగా 50 కేసులు నమోదయ్యాయి. 16 మంది నిందితులను అరెస్టు చేశారు. వందల మంది బాధితులు 2024లో అప్పటి పోలీస్‌ కమిషనర్‌ను ఆశ్రయించారు. దీంతో చిట్‌ డబ్బులు చెల్లించకుండా మోసాలకు పాల్పసడిన నిర్వాహకులపై పోలీసులు క్రిమినల్‌ కేసులను నమోదు చేయడంతో కొంతమంది చిట్‌ఫండ్స్‌ నిర్వాహకులు దారికి వచ్చి బాధితులతో రాజీ కుదుర్చుకుని వాయిదా పద్ధతిలో చెల్లించారు. ఒక చిట్‌ఫండ్స్‌కు చెందిన ఆస్తులను అటాచ్డ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రెండున్నరేళ్లుగా డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారు...

- అరిగెల అనిల్‌కుమార్‌, కరీంనగర్‌ సప్తగిరి కాలనీ

నేను కరీంనగర్‌లోని భవితశ్రీ చిట్‌ఫండ్‌లో చిట్‌వేశాను. చిట్‌ పూర్తి అయిన తరువాత నాకు డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. 2023 ఏప్రిల్‌ 25న నాకు రావాల్సిన చిట్‌ డబ్బులు 2.7 లక్షలకుగాను 3 చెక్కులను ఇచ్చారు. ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వడం లేదు. చిట్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, చిట్‌ఫండ్స్‌ల చుట్టూ తిరుగుతున్నా నాకు న్యాయం జరగడం లేదు. నా డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి.

Updated Date - Sep 07 , 2025 | 01:26 AM