హెచ్‌టీఆర్ వైఫల్యంపై కేంద్రం సీరియస్
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:54 PM
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో కీలకమైన హెచ్‌టీఆర్ వైఫల్యంపై కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కేంద్రం రూ.6వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పరిశ్రమలో టెక్నాలజీ వైఫల్యంతో ఈ ఏడాది సుమారు 4నెలల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది.
కోల్‌సిటీ, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో కీలకమైన హెచ్‌టీఆర్ వైఫల్యంపై కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కేంద్రం రూ.6వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పరిశ్రమలో టెక్నాలజీ వైఫల్యంతో ఈ ఏడాది సుమారు 4నెలల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. గత నెలలో దీనిపై విచారణకు కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ దేశంలోని వివిధ ఎరువుల కంపెనీలకు చెందిన యాజమాన్యాలతో ఉన్నత స్థాయి కమిటీ వేసింది. హిందుస్థాన్ ఊర్వక్ అండ్ రసాయన లిమిటెడ్(హెచ్‌యూఆర్‌ఎల్) సీఎండీ ఎస్‌పీ మహంతి, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ సీఎండీ ముదుగోర్కర్, ఆర్‌ఎఫ్‌సీఎల్ సీఈఓ మనోహరన్, మద్రాస్ ఫెర్టిలైజర్స్ సీఎండీ ఎంకే జైన్, ఆర్‌సీఎఫ్ డీటీ రియా గోస్వామిలతో కూడిన ఉన్నత స్థాయి బృందం గత నెలలో కంపెనీని సందర్శించి విచారణ జరిపింది. కంపెనీలో హెచ్‌టీఆర్ వైఫ ల్యంతో ఏర్పడిన ఇబ్బందులు, తదుపరి చర్యల గురించి ఆరా తీసింది. హల్దర్స్ టాప్స్, ఎల్‌అండ్‌టీకి చెందిన నిపుణులతోనూ చర్చించింది. అనంతరం కేంద్ర, ఎరువుల రసాయనాల మంత్రిత్వశాఖకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఆర్‌ఎఫ్‌సీఎల్ ఒక కీలకమైన హైటెంపరేచర్ రిఫార్మర్(హెచ్‌టీఆర్) వైఫల్యానికి డెన్మార్క్‌కు చెందిన హల్దర్ టాప్స్ సంస్థదే బాధ్యత అని, ఆ సంస్థనే మమ్మతులు చేయించాలని పేర్కొన్నది. దీంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. డెన్మార్క్ హై కమిషనర్ దృష్టికి విష యాన్ని తీసుకెళ్లారు. హల్దర్ టాప్స్ సంస్థ ఇచ్చిన టెక్నాలజీ, యంత్రాల వైఫ ల్యంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు సుమారు రూ.400కోట్ల నష్టం జరిగిందని, ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో రైతాంగానికి యూరియా సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నది. హల్దర్‌టాప్స్ సంస్థనే మర మ్మతులు చేయించాలని పేర్కొన్నది. దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే హల్దర్ టాప్స్‌పై దేశంలో బ్లాక్ లిస్టు ఉంటుందని పేర్కొన్నట్టు సమాచారం.
రామగుండంలోనే టెక్నాలజీ సమస్యలు...
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు మూతపడిన ఎరువుల కర్మాగారాలను వివిధ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల భాగస్వామ్యంతో పునరుద్ధరించింది. రామగుండంలో రామగుండం ఫెర్టిలైజర్స్ పేర పునరుద్ధరించారు. ఈ పరిశ్రమలు గ్యాస్ ఆధా రిత పరిశ్రమలే. ఈ ఐదు పరిశ్రమల నుంచి యేటా 63.5లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేయడం ద్వారా విదేశాల నుంచి యూరియా దిగుమతులు తగ్గించుకోవాలని కేంద్రం భావించింది. గ్యాస్ ఆధారిత పరిశ్రమలుగా పునరుద్ధరించారు. ఈ ఐదు పరిశ్రమల్లో రామగుండంలో మాత్రమే హల్దర్ టాప్స్ టెక్నాలజీతో పరిశ్రమను పునరుద్ధరించారు. ఇక్కడ మాత్రమే హెచ్‌టీఆర్ సమస్య ఏర్పడింది. దీంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. మొదట ఉన్నత స్థాయి బృందంతో విచారణ జరిపించింది.
మరమ్మతులకు హల్దర్ టాప్స్ సానుకూలత
కేంద్రం ఒత్తిడితో ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు టెక్నాలజీ సరఫరా చేసి హల్దర్ టాప్స్ సంస్థ దిగివచ్చినట్టు తెలుస్తుంది. కీలకమైన హెచ్‌టీఆర్‌ను మరమ్మతు చేసేందుకు సానుకూత వ్యక్తం చేసినట్టు సమాచారం. కానీ వారంటీ విషయంలో ఎరువుల రసాయనాల శాఖకు హల్దర్ టాప్స్‌కు మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కొత్త హెచ్‌టీఆర్ కొనుగోలు చేయాలంటే రూ.150 నుంచి రూ.200కోట్లు అవసరం ఉంటాయి. మరమ్మతులకు రూ.40కోట్ల వరకు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. హెచ్‌టీఆర్‌ను రామ గుండం నుంచి డెన్మార్క్‌కు తీసుకెళ్లి అక్కడ మరమ్మతులు చేసి మళ్లీ తీసుకువచ్చి బిగించాల్సి ఉంటుంది. దీనికి ఏడాది కాలం పట్టే అవకాశం ఉంది.
హెచ్‌టీఆర్ లేకుండానే యూరియా ఉత్పత్తి...
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో హెచ్‌టీఆర్ ఫెల్యూవర్‌తో హెచ్‌టీఆర్‌కు సంబంధం లేకుండానే ప్రైమరీ రిఫార్మర్ ద్వారా యూరియా ఉత్పత్తి చేస్తున్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో రోజుకు 3850టన్నుల యూరియా ఉత్పత్తి జరుగాల్సి ఉండగా 3500టన్నుల యూరియాను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. గత నెలలో 1.13లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరుగగా తెలంగాణకు 45వేల టన్నుల యూరియా అందించారు. ఈ నెలలో ఇప్పటి వరకు తెలంగాణకు 9వేల టన్నులకు పైగా యూరియా రవాణా జరిగింది. ప్లాంట్ ఎలాంటి సాంకేతిక అవరోధాలు లేకుండా నడిస్తే తెలంగాణకు యూరియా తిప్పలు ఉండవు. హెచ్‌టీఆర్ మరమ్మతులు చేసి బిగిస్తే రోజుకు 4వేల టన్నుల వరకు యూరియా ఉత్పత్తికి అవకాశం ఉంటుంది.