Share News

ఎన్నికల పండుగకు బ్రేక్‌..

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:25 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. రెండు రోజులుగా హైకోర్టులో జరుగుతున్న వాదనలు రిజర్వేషన్ల ఉత్కంఠతను నింపింది. చివరకు 42 శాతం బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో ఆశావహుల్లో నిరాశ నింపింది.

ఎన్నికల పండుగకు బ్రేక్‌..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పల్లె ఎన్నికల పండుగకు నామినేషన్ల తొలిరోజే బ్రేక్‌ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో రిజర్వేషన్లు ఖరారు, ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ జారీ చేయడంతో పల్లెల్లో రాజకీయాలు వేడెక్కాయి. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. రెండు రోజులుగా హైకోర్టులో జరుగుతున్న వాదనలు రిజర్వేషన్ల ఉత్కంఠతను నింపింది. చివరకు 42 శాతం బీసీ రిజర్వేషన్ల జీవో 9పై హైకోర్టు స్టే విధించడంతో ఆశావహుల్లో నిరాశ నింపింది. హైకోర్టు నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా అనే సందిగ్ధత ఏర్పడింది. మరోవైపు నాలుగు వారాల తర్వాత బీసీ రిజర్వేషన్లు ఉంటాయా లేదా పాత రిజర్వేషన్లు ముందుకు వస్తాయా అనే చర్చలు మొదలయ్యాయి. గతంలో 23 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ వచ్చిన రిజర్వేషన్లతో స్థానిక సంస్థల్లో బీసీల ప్రాబల్యం పెరుగుతుందని భావించారు.

ఫ తుది తీర్పు తర్వాతే ముందుకు..

స్థానిక సంస్థల రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించింది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు పోటీకి సిద్ధపడ్డ అభ్యర్థులు హైకోర్టు తుది జడ్జిమెంట్‌ తర్వాతనే ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. పరిస్థితులకు తగ్గట్టుగానే పోటీకి ఏర్పాట్లు చేసుకోవాలని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఆశావహులు మద్దతు కూడగట్టుకునే పనిలో డబ్బులు ఖర్చు చేసి లబోదిబోమంటున్న వారున్నారు. రిజర్వేషన్లు మారి తమకు అనుకూలంగా లేకపోతే పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 260 సర్పంచులు, 2268 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లా గ్రామీణ ఓటర్లు 3 లక్షల 53 వేల 351 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 170772 మంది, మహిళలు 182559 మంది ఉన్నారు. ఇప్పటికే 12 జడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు మూడు, బీసీలకు ఐదు, జనరల్‌ మూడు స్థానాలను కేటాయించారు. జడ్పీ చైర్మన్‌ ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ చేశారు. 123 ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీలకు 7, ఎస్సీలకు 25, బీసీలకు 56, జనరల్‌ 35 స్థానాలను కేటాయించారు. ఎంపీపీల రిజర్వేషన్లలో రుద్రంగి ఎస్టీ జనరల్‌, ముస్తాబాద్‌ ఎస్సీ మహిళ, కోనరావుపేట ఎస్సీ జనరల్‌, వేములవాడ రూరల్‌ ఎస్సీ జనరల్‌, ఇల్లంతకుంట బీసీ మహిళ, బోయినపల్లి బీసీ మహిళ, గంభీరావుపేట, వేములవాడ అర్బన్‌, ఎల్లారెడ్డిపేట బీసీ జనరల్‌, వీర్నపల్లి మహిళా జనరల్‌, చందుర్తి, తంగళ్ళపల్లి జనరల్‌ రిజర్వ్‌ చేశారు. 260 సర్పంచ్‌ స్థానాల్లో ఎస్టీలకు 30, ఎస్సీలకు 53, బీసీలకు 101, జనరల్‌ 76 స్థానాలను కేటాయించారు. దీని ప్రకారం షెడ్యూల్‌ జారీ చేయడంతో పాటు గురువారం తొలి విడత నామిషన్ల స్వీకరణ ప్రారంభించారు.

ఫ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి..

జిల్లాలో అప్పటికే అధికార యంత్రాగం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు 123 ఉండగా, జడ్పీటీసీ స్థానాలు 12ఉండగా, 260 జీపీలు, 2268 వార్డులు ఉన్నాయి. మొదటి విడతలో 65 స్థానాలు, 377 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. బోయినపల్లి 11 స్థానాలు, 10 పోలింగ్‌ కేంద్రాలు, చందుర్తి 10 స్థానాలు, 54 పోలింగ్‌ కేంద్రాలు, రుద్రంగి 5స్థానాలు, 27 పోలింగ్‌ కేంద్రాలు, వేములవాడ అర్బన్‌ 6 స్థానాలు, 36 పోలింగ్‌ కేంద్రాలు, వేములవాడ రూరల్‌ 7 స్థానాలు, 40 పోలింగ్‌ కేంద్రాలు, కోనరావుపేట 12 స్థానాలు, 70 పోలింగ్‌ కేంద్రాలు, ఇల్లంతకుంట 14 స్థానాలు, 90 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. రెండో విడతలో 58 స్థానాలు, 332 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. తంగళ్ళపల్లి 14స్థానాలు, 77పోలింగ్‌ కేంద్రాలు, ఎల్లారెడ్డిపేట 13 స్థానాలు, 85 పోలింగ్‌ కేంద్రాలు, వీర్నపల్లి 5 స్థానాలు, 26 పోలింగ్‌ కేంద్రాలు, ముస్తాబాద్‌ 13 స్థానాలు, 75 పోలింగ్‌ కేంద్రాలు, గంభీరావుపేట 13 స్థానాలు, 69 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. రెండో ఫేజ్‌లో మొదటి విడతలో జీపీలు 137, వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 1188 ఉన్నాయి, గంభీరావుపేట జీపీలు 22 వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 202, ముస్తాబాద్‌ జీపీలు 22 వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 202, తంగళ్ళపల్లి జీపీలు 30, వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 252, ఇల్లంతకుంట జీపీలు 35, వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 294, కోనరావుపేట జీపీలు 28, వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 238 ఉన్నాయి. మూడో ఫేజ్‌లో జీపీలు 123, వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 1080 ఉన్నాయి. వేములవాడ అర్బన్‌ జీపీలు 11, వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 86, రుద్రంగి జీపీలు 10, వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 86, చందుర్తి జీపీలు 19, వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 174, వేములవాడ రూరల్‌ జీపీలు17 వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 174, బోయినపల్లి జీపీలు 23, వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 212, వీర్నపల్లి జీపీలు 17, వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 132, ఎల్లారెడ్డిపేట జీపీలు 26, వార్డులు, పోలింగ్‌ కేంద్రాలు 226 ఉన్నాయి.

Updated Date - Oct 10 , 2025 | 12:25 AM