స్థానిక ఎన్నికలకు బ్రేక్
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:32 AM
జిల్లాలో తొలి విడతలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను నిర్వహించడానికి గురువారం ఉదయం అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా, సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్, జీవో నంబరు 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జగిత్యాల, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి విడతలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను నిర్వహించడానికి గురువారం ఉదయం అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా, సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్, జీవో నంబరు 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల రెవెన్యూ డివిజన్‌లలోని మండలాలతో పాటు జగిత్యాల రెవెన్యూ డివిజన్‌లోని రాయికల్, సారంగపూర్, బీర్‌పూర్ మండలాల్లో తొలి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల పర్వాన్ని ప్రారంభించారు. అయితే 42 శాతం బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు సాయంత్రానికల్లా ఎన్నికల నోటిఫికేషన్, జీవో నంబరు 9పై స్టేను విధించింది. ఎన్నిలక ప్రక్రియ నిలిచిపోవడంతో బీసీ ఆశావహులు నిరాశకు గురయ్యారు.
ఫతొలి విడతలో 10 జడ్పీటీసీ, 108 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్..
జిల్లాలో గురువారం ఉదయం తొలి విడతలో 10 జడ్పీటీసీ స్థానాలకు, 108 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని సారంగపూర్, బీర్‌పూర్, రాయికల్ మండలాలతో పాటు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలు, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కథలాపూర్, మేడిపల్లి, బీమారం మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా మండలాల మండల పరిషత్ అభివృద్ది అధికారి కార్యాలయాల్లో నోటిఫికేషన్‌ను ప్రదర్శించారు. జడ్పీటీసీ స్థానానికి జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో, ఎంపీటీసీ స్థానాలకు ఆయా మండల పరిషత్‌లలో నామినేషన్ కేంద్రాలు ఏర్పరిచారు.
ఫరెండు నామినేషన్లు
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వాన్ని అధికారులు ప్రారంభించారు. జడ్పీటీసీ స్థానానికి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. అయితే ఎంపీటీసీ స్థానాలకు రెండు నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు ప్రకటించారు. కథలాపూర్ మండలంలోని ఎంపీటీసీ స్థానానికి, ఇబ్రహీంపట్నం మండలంలోని ఒక ఎంపీటీసీ స్థానానికి ఒక్కొక్కటి చొప్పున మొత్తంగా రెండు నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు ప్రకటించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లాలో స్థానిక సంస్థల నామినేషన్ ప్రక్రియను కలెక్టర్ సత్యప్రసాద్‌తో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకులు లక్ష్మణుడు పర్యవేక్షించారు. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో కలెక్టర్ సత్య ప్రసాద్ పర్యటించి నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.
్జ్జఫఎన్నికల కోడ్ ఎత్తివేత
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం, తాజాగా నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ ఎత్తివేసినట్లే. గత నెల 30వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే. అప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అయితే తాజాగా ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల కోడ్ అమలు చేసే అవకాశం లేకుండా పోయింది.