Share News

యాసంగిపై నీలినీడలు

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:55 AM

యాసంగి సాగు రైతులకు కన్నీటి కష్టాలను మిగిల్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడం, భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు వరి పంట వైపు మొగ్గు చూపి భారీగా విస్తీర్ణాన్ని పెంచుకున్నారు.

యాసంగిపై నీలినీడలు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

యాసంగి సాగు రైతులకు కన్నీటి కష్టాలను మిగిల్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడం, భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు వరి పంట వైపు మొగ్గు చూపి భారీగా విస్తీర్ణాన్ని పెంచుకున్నారు. మార్చి, ఏప్రిల్‌ మాసంలో ఎండల ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితులు ఫిబ్రవరి మాసంలోనే కనిపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో భూగర్భ జలాలు 7.98 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయి. మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌లో 27.55 టీఎంసీల సామర్థ్యానికి 17.74 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎండలు ముదురుతుండడంతో జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్‌, కోనరావుపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో సాగునీరు తగ్గిపోయి పంటలు ఎండుతున్నాయి. నెర్రలు బారిన పొలాలు కనిపిస్తున్నాయి. సాగునీటి కోసం రైతులు మళ్లీ బోరుబావులను తవ్వుకుంటున్నారు.

జిల్లాలో 1.76 లక్షల ఎకరాల్లో వరి సాగు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగిలో 1.80 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, వరి 1.76 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కూలీల కొరత ఉన్నా బీహార్‌, బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలతో వరి నాట్లను వేసుకున్నారు. కూలీల కొరతతో నాట్లు కొంత ఆలస్యంగానే పడ్డాయి. వరి పంట తొలి దశలోనే సాగునీటి కొరతకు ప్రమాద ఘంటికలు మోగుతుండడంతో రైతులు పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక అయోమయం చెందుతున్నారు. కొన్నిచోట్ల పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో పశువుల మేతకు వదిలేస్తున్నారు.

జిల్లాలో భూగర్భ జలాలు (మీటర్లలో)

మండలం జనవరి 2024 జనవరి 2025

బోయినపల్లి 5.78 5.83

చందుర్తి 5.90 3.97

గంభీరావుపేట 9.07 11.05

ఇల్లంతకుంట 6.47 5.14

కోనరావుపేట 8.63 8.34

ముస్తాబాద్‌ 10.49 7.34

రుద్రంగి 6.01 5.31

సిరిసిల్ల 11.82 11.65

తంగళ్లపల్లి 8.05 6.33

వీర్నపల్లి 12.56 11.50

వేములవాడ రూరల్‌ 4.48 4.30

వేములవాడ అర్బన్‌ 12.20 12.69

ఎల్లారెడ్డిపేట 13.87 13.82

----------------------------------------------------------------------------------------------------

జిల్లా సరాసరి 8.70 7.98

-----------------------------------------------------------------------------------------------------

Updated Date - Feb 23 , 2025 | 12:55 AM