కాంట్రాక్టర్లను బ్లాక్‌మెయిల్ చేస్తే సహించేది లేదు
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:45 PM
రామగుండం నగరపాలక సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టర్లను కొందరు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, వారి చర్యలను సహించేది లేదని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కాంట్రాక్టర్లు కృపాకర్‌రావు, విశ్వతేజ, కుర్మ శ్రీనివాస్, కోడూరి రవి తదితరులు మాట్లాడారు.
కళ్యాణ్‌నగర్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టర్లను కొందరు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, వారి చర్యలను సహించేది లేదని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కాంట్రాక్టర్లు కృపాకర్‌రావు, విశ్వతేజ, కుర్మ శ్రీనివాస్, కోడూరి రవి తదితరులు మాట్లాడారు. నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు పనులు లేవని, చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పెద్దపనులన్నీంటిని హైదరాబాద్, వరంగల్, ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్లు అంచనాలపై 5శాతం అధిక రేటు దాఖలు చేసి తీసుకుంటున్నారని, పదేళ్లుగా ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్లే రామగుండంలో పనులు చేస్తున్నారన్నారు. వారు కూడా బిల్లులు రావడం లేదని పనులను మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోయారన్నారు. కార్పొరేషన్‌పై ఆధారపడి 200కాంట్రాక్టర్ల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, తమకు పనులు లేవని కలెక్టర్, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌లకు మొర పెట్టుకున్నామన్నారు. ఆన్‌లైన్ టెండర్లలో అంచనాలపై తక్కువ రేటుపై తాము టెండర్లు దాఖలు చేశామని, ఆన్‌లైన్ టెండర్లలో అన్నీ ప్రాంతాల వారు టెండర్లు వేసేందుకు అవకాశం ఉందన్నారు.
తాము లెస్ టెండర్లు వేస్తే రింగ్ అయ్యామని, ఖజానాకు గండికొట్టామని, కోట్ల రూపాయలు వసూలు చేశామంటూ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత, ఆమె భర్త రాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో వీరు కార్పొరేటర్‌గా పని చేసిన సమయంలో 4శాతం కమీషన్ ఇవ్వనిదే పనులు చేయనివ్వలేదని ఆరోపించారు. 5శాతం ఎక్సెస్ టెండర్లు ఇచ్చేందుకు నిబంధనలే ఉన్నాయని, పెద్ద పనులకు ఎక్సెస్ టెండర్లు ఇస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లుగా తాము అంచనాల ప్రకారమే టెండర్లు దాఖలు చేశామే తప్ప అంచనాలు మార్చే పరిస్థితి ఉండదన్నారు. కాంట్రాక్టర్లలో అన్నీ పార్టీలు, అన్నీ వర్గాలకు చెందిన వారు ఉన్నారని, అధికార పార్టీతో సంబంధం లేదన్నారు. తమపై అబద్దపు ఆరోపణలు చేసే వారిపై కేసులు పెడతామని, పరువునష్టం దావా కూడా వేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు రజినికాంత్, దాసరి సాంబమూర్తి, సదానందం, ప్రతాప్‌రెడ్డి, శశికాంత్‌రెడ్డి పాల్గొన్నారు.