Share News

నల్లబారిన పత్తి నేలవాలిన వరి

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:44 PM

వాతావరణ మార్పులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీజన్‌ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల మొక్కలు ఎండిపోయాయి. మహరాష్ట్రలో వర్షాల కారణంగా గోదావరి నదిలో వరదలు రావడంతో గోదావరి పరివాహక ప్రాంతాలలో వరదలతో పంటలు నీట మునిగి పత్తి చేనులో నీరు నిలిచి కుళ్లిపోయాయి.

నల్లబారిన పత్తి  నేలవాలిన వరి

మంథనిరూరల్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వాతావరణ మార్పులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సీజన్‌ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్ని చోట్ల మొక్కలు ఎండిపోయాయి. మహరాష్ట్రలో వర్షాల కారణంగా గోదావరి నదిలో వరదలు రావడంతో గోదావరి పరివాహక ప్రాంతాలలో వరదలతో పంటలు నీట మునిగి పత్తి చేనులో నీరు నిలిచి కుళ్లిపోయాయి. సీజన్‌ చివరలో పంట చేతికి వచ్చే సమయంలో ఇప్పుడు వర్షాల కారణంగా పత్తి పంట ఎర్రబడి కాయలు నల్ల బడుతున్నాయి. దీంతో రైతులు అందోళన చెందుతున్నారు. మంథని మండలంలో సుమారుగా పది వేల ఎకరాలలో రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారు. అయితే ఇప్పటికే గోదావరి నదిలో వరదల కారణంగా విలోచవరం, పోతారం గ్రామాలలో పత్తి పంటకు భారీ నష్టం వాటిల్లింది. మరో పది రోజులలో పత్తి పంట చేతికి వచ్చే సమయలో వర్షాల కారణంగా ఉప్పట్ల, పోతారం, విలోచవరం, నాగారం, మల్లేపల్లి, మంథని ప్రాంతాలలో పత్తి పంట దెబ్బతిన్నది. పత్తి మొక్క కింది భాగంలో ఆకులు ఎండిపోవడం, ఎర్రబారడం, ఆకులపై మచ్చలు ఏర్పడడం, కాయలు నల్ల బారడం వంటి లక్షణాలతో పత్తి పంటకు నష్టం జరుగుతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరానికి రూ.25 నుంచి 30 వేల వరకు పెట్టుబడి పెట్టామని, కొద్ది రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో పూర్తిగా దెబ్బతినడంతో ఆందోళన కల్గిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులు పెట్టుబడితో పాటు అదనంగా ఎకరాలకు రూ. 18 నుంచి 25 వరకు పెట్టుబడి పెట్టాల్సి వచ్చిందని, తమకు ఎకరానికి రూ. 70 వేల వరకు ఖర్చు అవుతుందని రైతులు తెలిపారు. కాయ నల్లబడటంతో పంటను కొనుగోలు చేయరని, అధికారులు సర్వే చేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ఒక వైపు వరదలు మరో వైపు వర్షాల కారణంగా ఈ సీజన్‌లో పత్తి రైతులకు ఆర్థిక నష్టాలు వాటిల్లుతున్నాయి.

రెండు ఎకరాల్లో పత్తి కాయలు నల్లబడ్డాయి..

లక్కాకుల కిష్టయ్య, విలోచవరం.

నాకు ఉన్న 3 ఎకరాలతోపాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేస్తున్నా. కౌలుకు తీసుకున్న 2 ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా ఎర్రబడి కాయలు నల్లగా మారాయి. దీంతో రెండు ఎకరాల్లో పత్తిని ఎవరు కొనుగోలు చేయరు. కౌలుతో కలుపుకొని ఎకరానికి రూ. 60-70 వేలు పెట్టబడి పెట్టాను. పూర్తిగా రెండు ఎకరాల్లో పంట నష్ట జరిగింది.

భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంట

ఎలిగేడు, అక్టోబరు6(ఆంధ్రజ్యోతి): మండలంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి చేతికంది వచ్చే దశలో ఉన్న వరి పొలాలు నేలమట్టం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. ఉరుములు, తీవ్రమైన గాలులతో వరి పైరు నేలవాలాయి. పొట్ట దశ, పాలు పట్టేదశ, మరికొన్ని గొలకదశలో ఉన్న పొలాలు చేతికి వస్తాయనే ఆనందంలో ఉన్న రైతుల ఆశలు నిరాశలయ్యాయి. వ్యవసాయ అధికారులు రైతుల పొలాలను పరిశీలిస్తున్నారు. తమకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. అధికారులు మాత్రం ఇది నష్టం కాదని, దాట వేస్తున్నారని పలు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో మండల వ్యాప్తంగా 13,300 ఎకరాలలో వరి పంటను సాగు చేశారు. మరి కొద్ది రోజుల్లో వరి పంట అందుతుందన్న ఆశతో ఉన్న అన్నదాతకు ఈ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ప్రభుత్వం నష్టపోయిన పొలాలను గుర్తించి పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. లలితపల్లి, సుల్తాన్‌పూర్‌, ధూళికట్ట తదితర గ్రామాల్లో దెబ్బతిన్న వరి పొలాలను ఏఓ ఉమాపతి రైతులతో కలిసి పరిశీలించారు.

Updated Date - Oct 06 , 2025 | 11:44 PM