అన్ని కులాల అభ్యున్నతికి బీజేపీ కృషి
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:16 AM
దేశంలోని అన్ని కులాల అభ్యున్నతికి బీజేపీ కృషి చేస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. బుధవారం రాత్రి ఎన్టీపీసీలో జరిగిన కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో రాంచందర్‌రావు ప్రసంగించారు. కుల వృత్తులను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, కుల వృత్తుల వారిగా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు.
జ్యోతినగర్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి) : దేశంలోని అన్ని కులాల అభ్యున్నతికి బీజేపీ కృషి చేస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. బుధవారం రాత్రి ఎన్టీపీసీలో జరిగిన కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో రాంచందర్‌రావు ప్రసంగించారు. కుల వృత్తులను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, కుల వృత్తుల వారిగా సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. కేంద్ర పథకాలను అర్హులైన కుల వృత్తులు చేస్తున్న ప్రజలకు చేరేలా బీజేపీ శ్రేణులు కృషి చేయాలన్నారు. కుల వృత్తులన్నీ వెనుకబడిన కులాలకు చెందినవేనని, బీసీలకు మేలు చేసేందుకు మోదీ సర్కారు పని చేస్తోందని తెలిపారు.
గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుల వృత్తుల గురించి ప్రగల్భాలు పలికిందని, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్ల కుంభకోణం బయట పడిందన్నారు. త్వరలో కోల్‌బెల్ట్ ఏరియాలో పర్యటన చేపడుతానని, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత, శ్రీనివాస్ గొమాసె, సునీల్‌రెడ్డి, బల్మూరి వనిత, మెరుగు హన్నంతు గౌడ్, క్యాతం వెంకట రమణ, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.