ఉత్తమ ఫలితాలే లక్ష్యం
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:14 AM
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. పదో తరగతి చదివే విద్యార్థుల వార్షిక పరీక్షల్లో ఏ విధంగా సన్నద్ధం కావాలనేది టీజీఎస్‌ఈఆర్టీ ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. పదో తరగతి చదివే విద్యార్థుల వార్షిక పరీక్షల్లో ఏ విధంగా సన్నద్ధం కావాలనేది టీజీఎస్‌ఈఆర్టీ ప్రత్యేక కార్యాచరణ ప్రకటించింది. దీని ప్రకారం జిల్లాలో ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక తరగతుల నిర్వహణ మొదలుపెట్టారు. బోధించిన పాఠ్యాంశాలలో ముఖ్యాంశాలను మరోసారి అర్థం చేయించడం, అవసరమైన సబ్జెక్టులు మరోసారి బోధిస్తారు. విద్యార్థులకు కలిగే సందేహాలు తీరుస్తున్నారు. పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
జిల్లాలో 7452 మంది విద్యార్థులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 667 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులు 79,747 మంది ఉన్నారు. ఇందులో బాలురు 39,147 మంది, బాలికలు 40,600 మంది ఉన్నారు. జిల్లాలో రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 109 జడ్పీ ఉన్నత పాఠశాలలు, 13 కేజీబీవీలు, 7 మోడల్ స్కూలు, మూడు ఎంపీహెచ్‌ఎస్, 21 రెసిడెన్షియల్, వెల్ఫేర్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో పదో తరగతి విద్యార్థులు 7,452 మంది ఉన్నారు. ఇందులో బాలురు 3,622 మంది, బాలికలు 3,830 మంది ఉన్నారు. పదో తరగతి పరీక్షల్లో గతంలో కంటే మెరుగైన ఫలితాలు విద్యార్థులు సాధించే దిశగా విద్యార్థులకు అభ్యాసన దీపికలు కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం డిసెంబరు వరకు సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. జనవరి నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు పూటలు తరగతులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతులు పకడ్బందీగా కొనసాగేలా ఇప్పటికే ప్రధానోపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించారు. ప్రత్యేక తరగతులతో పాటు టెస్టులు కూడా నిర్వహిస్తారు.
ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు
పది ఫలితాల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపే విధంగా ప్రతి సంవత్సరం వార్షిక పరీక్ష సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో కూడా విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ఉపాధ్యాయులకు విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఉపాధ్యాయులు సిలబస్ జనవరి 10లోపు పూర్తిచేయాలని ఆ తర్వాత రివిజన్ తరగతులు ప్రారంభించాలని సూచించింది. ఎస్‌ఏ-1 పరీక్షల ఫలితాల ఆధారంగా విద్యార్థులను ఏ,బీ,సీ గ్రూపులుగా విభజించి సీ గ్రూప్ విద్యార్థులకు పునశ్చరణ తరగతులు స్లిప్‌టెస్టులు నిర్వహించాలి. ప్రతి ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకొని వారిని వ్యక్తిగతంగా మార్గదర్శనం చేయాలి. విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా పర్యవేక్షణ చేయాలని విద్యాశాఖ పేర్కొంది.
జిల్లాలో ‘పది’ ఫలితాలు ఇలా..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదో తరగతి పరీక్షల ఫలితాలు కొంత ఆశాజనకంగానే ఉన్నప్పటికీ ముందు వరుసలో నిలవలేకపోతోంది. మరోవైపు కొన్ని పాఠశాలల్లో విద్యా బోధనపై అంతంత మాత్రంగానే బోధనపై ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ కొరవడుతుందనే విమర్శలు ఉన్నాయి. 2024-25 పది ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రస్థాయిలో తన స్థానాన్ని తగ్గించుకుంది. 2023-24 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిన జిల్లా ఈసారి 98.15 శాతం ఉత్తీర్ణతతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 2024-25 జిల్లాలో 6754మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరుకాగా, 6629 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 3119 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 3041 మంది ఉత్తీర్ణులయ్యారు. 3635 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా 3588 మంది ఉత్తీర్ణులయ్యారు. సంవత్సరాల వారీగా పలితాలు చూస్తే 2016-2017 విద్యాసంవత్సరంలో 87.3 ఉత్తీర్ణత సాదించారు. 2017-2018లో 91.3శాతం, 2018 - 2019లో 97.7శాతం, 2019 - 2020లో 100 శాతం, 2020-2021లో 100శాతం, 2021-2022లో 95.76 శాతం, 2022-2023లో 94.37శాతం, 2023-2024లో 98.27శాతం, 2024-2025లో 98.15 శాతం సాధించారు.