అందంగా.. ఆకర్షణీయంగా
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:29 AM
స్వశక్తి మహిళలకు ప్రభుత్వం పంపిణీ చేసే చీరలు అందంగా ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. బతుకమ్మ సంబరాల్లో మహిళలు సిరిసిల్ల నేతన్నలు నేసిన చీరను అందుకోనున్నారు. ప్రభుత్వం అందించిన చీరల ఆర్డర్ల లక్ష్యం దిశగా ఉత్పత్తి జరుగుతోంది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
స్వశక్తి మహిళలకు ప్రభుత్వం పంపిణీ చేసే చీరలు అందంగా ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. బతుకమ్మ సంబరాల్లో మహిళలు సిరిసిల్ల నేతన్నలు నేసిన చీరను అందుకోనున్నారు. ప్రభుత్వం అందించిన చీరల ఆర్డర్ల లక్ష్యం దిశగా ఉత్పత్తి జరుగుతోంది. ఈ నెల 30లోగా ఆర్డర్లను పూర్తి చేయాల్సి ఉండడంతో నేతన్నలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బతుకమ్మ కానుకగా తెలంగాణ సర్కార్ స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు ప్రతి సంవత్సరం రెండు చీరలు అందించే విధంగా నిర్ణయించారు. సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు చేతినిండా ఉపాధి కలుగుతుందనే ఆలోచనతో చీరల ఉతఁత్తి ఆర్డర్లను అందించారు. నాణ్యతలో ఎలాంటి తేడా రాకుండా చర్యలు తీసుకున్నారు. స్వశక్తి మహిళకు డ్రెస్ కోడ్ గా ఉండే విధంగా ఉత్పత్తి చేసిన చీరలను బతుకమ్మ పండుగకు పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్పత్తి చేసిన బట్టను ప్రాసెసింగ్, ప్రింటింగ్ పూర్తిచేసి వివిద జిల్లాలోని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. మహిళలకు అదించే స్వశక్తి చీరను సిరిసిల్లలో గత నెలలో చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు.
సిరిసిల్ల నేతన్నకు చీరలతో భరోసా
నిత్యం ఒడిదుడుకుల మధ్య సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలలో అనేక కష్టాలు ఎదురీదుతున్న నేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్డర్లు భరోసాను కల్పిస్త్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చీరలో ఉత్పత్తితో చేతినిండా పని కడుపునిండా వేతనంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు 2017 నుంచి 2023 వరకు ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని నిలుపివేసింది. ప్రభుత్వం నుంచి ఆర్డర్లు లేకపోవడంతో వస్త్ర పరిశ్రమ ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయింది. నేతన్నల ఆత్మహత్యలు, కార్మిక సంఘాల ఆందోళనలు, అనేక విషాధ సంఘటనల మధ్య ప్రభుత్వం మళ్లీ సిరిసిల్ల నేతన్నల ఉపాధిని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన చీరలను ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వశక్తి సంఘాల మహిళలకు పంపిణీ చేయడానికి నిర్ణయించింది. సిరిసిల్ల మరమగ్గాల కార్మికుల పనికల్పించే దిశగా ఆర్డర్లను ఇవ్వడంతో కార్మికులకు నిరంతరంగా ఉపాధి కలుగుతుందని భరోసా వచ్చింది.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 4.30 కోట్ల మీటర్ల ఆర్డర్లు
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం అందిస్తున్న బట్ట ఉత్పత్తి ఆర్డర్లు ఊరట ఇస్తున్నాయి. ఏడాదికి రెండు చీరలు ఇచ్చే విధంగా ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు మొదటి విడతగా ఈ సంవత్సరం జనవరి, మార్చిలో 4.30 కోట్ల మీటర్ల చీర బట్ట ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్ల మరమగ్గాలపైన 1.30 కోట్ల చీరల ఉత్పత్తి జరిగే విదంగా చర్యలు చేపట్టడంతో కార్మికులకు మళ్లీ చేతినిండా పని లభిస్తోంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కార్మికుల కొరత తీవ్రంగా ఉండడంతో స్వశక్తి చీరలు ఉత్పత్తి మొదట్లో వేగంగా జరుగలేదు. తరువాత ఉత్పత్తి లక్ష్యం దిశగా వేగం పుజుకుంది. గతంలో బతుకమ్మ చీరల ఉత్పత్తి కోసం ఇతర రాష్ట్రాల నుండే కాకుండా తెలంగాణలోని వరంగల్, జగిత్యాల, నల్లగొండ, వికారాబాద్ లాంటి జిల్లాల నుంచి కూడా నేత కార్మికులు సిరిసిల్లకు వచ్చి ఉపాధి పొందారు. బతుకమ్మ చీరలు ఉత్పత్తి ఆర్డర్లు రాకపోవడంతో కార్మికులు మహారాష్ట్రలోని బీవండి, షోలాపూర్, గుజరాత్‌లోని సూరత్ వంటి ప్రాంతాలకు వెళ్లారు. మరికొందరు ఇతర పనుల్లో స్థిరపడ్డారు. దీంతో స్వశక్తి చీరల ఉత్పత్తి ఇబ్బందికరంగా మారింది. సిరిసిల్లలో దాదాపు 30 వేల వరకు మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో జియోట్యాగింగ్ చేసిన మరమగ్గాలు 27 వేల వరకు ఉన్నాయి. ఇందులో స్వశక్తి చీరల ఉత్పత్తి 131 మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటీ సొసైటీ (మ్యాక్స్)ల ద్వారా 9,600 మరమగ్గాలపైన ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పటివరకు 4.30 కోట్ల బట్ట ఉత్పత్తి ఆర్డర్‌లో 3 కోట్ల మీటర్లు ఉత్పత్తి జరిగింది. ఆగస్టు 15న చీరలు అందించాలని లక్ష్యంగా ఉత్పత్తి అయిన బట్టను టెస్కో సేకరించడం ప్రారంభించినా ఉత్పత్తి పూర్తికాక పోవడంతో సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. ఇప్పటి వరకు 3 కోట్ల చీర బట్ట ఉత్పత్తి జరిగింది. అందులో 2.65 కోట్ల మీటర్లు సేకరించారు. మ్యాక్స్ సొసైటీల వద్ద 35 లక్షల మీటర్లు ఉంది.