ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధంగా ఉండాలి
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:23 AM
జిల్లాలో వానాకాలం సీజన్‌లో రైతులు సాగు చేసిన పంట దిగుబడులను కొనుగోలు చేసేందుకు పక్కాగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
పెద్దపల్లి, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం సీజన్‌లో రైతులు సాగు చేసిన పంట దిగుబడులను కొనుగోలు చేసేందుకు పక్కాగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీజన్‌లో ఎంత ధాన్యం వస్తుందో మండలాల వారీగా అంచనాలు తయారు చేయాలన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 2389 రూపాయలు, సాధారణ రకం ధాన్యానికి 2369 రూపాయల మద్దతు ధర చెల్లిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, టార్ఫాలిన్ మొదలగు వసతులు ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం దిగుబడి ఆధారంగా అవసరమైన మేర గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండాలన్నారు. డీఎస్‌ఓ శ్రీనాథ్, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, డీసీఓ శ్రీమాల, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, అడిషనల్ డీఆర్‌డీఓ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా స్వస్త్ నారీ, సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం
జిల్లాలో స్వస్త్ నారీ, సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వరకు స్వస్త్ నారీ, సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం జరగనున్నదని తెలిపారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు రోజూ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని, విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారి, ఇంటర్మీడియట్ అధికారుల సహకారంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లోని బాలికలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, అనేమియా, టీబీ వంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ, డీఈఓ డి.మాధవి, డీడబ్ల్యూఓ వేణు గోపాల్, తదితరులు పాల్గొన్నారు.