Share News

‘స్థానిక’ సంస్థల్లో బీసీల ఆధిపత్యమే..

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:37 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసిరానున్న రిజర్వేషన్లతో జిల్లాలో బీసీల ఆఽధిపత్యం పెరుగుతుందని భావిస్తున్నారు. హామీని నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే బీసీ రిజర్వేషన్లపై దృష్టి పెట్టింది. కుల గణనంలో బీసీ జనాభా లెక్కలు తీర్చడంతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ల అమలు చేసే విధంగా కీలక నిర్ణయాలు చేసింది.

‘స్థానిక’ సంస్థల్లో బీసీల ఆధిపత్యమే..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసిరానున్న రిజర్వేషన్లతో జిల్లాలో బీసీల ఆఽధిపత్యం పెరుగుతుందని భావిస్తున్నారు. హామీని నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే బీసీ రిజర్వేషన్లపై దృష్టి పెట్టింది. కుల గణనంలో బీసీ జనాభా లెక్కలు తీర్చడంతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ల అమలు చేసే విధంగా కీలక నిర్ణయాలు చేసింది. రిజర్వేషన్ల పరిమితిపై ఉన్న సీలింగ్‌ను తొలగించడం ద్వారా ఆర్డినెన్స్‌ జారీ చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నది. సోమవారం వరకు గవర్నర్‌ ఆమోదం వచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రిజర్వేషన్ల ఖరారుపై ఆసక్తి మొదలైంది. దృష్టి సారించిన ఆశావహులు ఎన్నికల రంగంలోకి దూకడానికి సిద్ధమవుతున్నారు. బీసీల్లో మాత్రం 42 శాతం రిజర్వేషన్లతో పాటు జనరల్‌ స్థానాల్లో కూడా బీసీలు ఉనికిని చాటుకునే దిశగా సిద్ధమవుతున్నారు. జిల్లాలో జనరల్‌ స్థానాల్లో బీసీలు అధిక సీట్లలో గెలుపొందారు. గత ఎన్నికల్లో పరిషత్‌, గ్రామపంచాయతీలో జనరల్‌ స్థానల్లో 41 మంది బీసీలు గెలుపొందారు. అదే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల బీసీల్లో కనిపిస్తున్న చైతన్యం స్థానిక సంస్థల్లో చూపబోతున్నారనే చర్చ కూడా కొనసాగుతోంది.

రిజర్వేషన్లపై ఉత్కంఠ..

స్థానికల్లో ముందుగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి, అదే క్రమంలో పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారని భావిస్తున్నారు. 42 శాతం బీసీలకు, 15 ఎస్సీలకు, 7 శాతం ఎస్సీలతో పాటు అన్ని కేటగిరీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను స్థానిక ఎన్నికలలో అమలు చేయడానికి ప్రభుత్వం ఆర్డినెన్స్‌ విడుదలైన వెంటనే పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ద్వారా రిజర్వేషన్ల కోటా ఉత్తర్వులు రావడంతోనే కలెక్టర్‌ ఆర్డీవోల నేతృత్వంలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌లకు రాష్ట్ర యూనిట్‌గా, ఎంపీపీ పదవులకు జిల్లా యూనిట్‌గా, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు సంబంధించి మండల యూనిట్‌గా గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు గ్రామయూనిట్‌గా రిజర్వేషన్లు నిర్ణయించనున్నారు. ఈ నెలాఖరులోగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసే దిశగా ప్రక్రియ మొదలైంది. దీని ప్రకారం సెప్టెంబర్‌లోపు పరిషత్‌, గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి అవుతాయని భావిస్తున్నారు

పెరుతున్న అవకాశాలు..

బీసీలు జనాభా ఎక్కువగా ఉన్నా రాజకీయంగా వెనకబడుతున్న నేపథ్యంలో 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు తొలిసారిగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. బీసీ రిజర్వేషన్లతో రాజకీయ చైతన్యంగా నాయకుల ఎదుగుదలకు తోడ్పడింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపల్‌ ఎన్నికల్లో 20 శాతం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఆ తరువాత బీసీ సంఘాలు రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటాలు చేయడంతో 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బీసీల రిజర్వేషన్‌ 34 శాతానికి తెచ్చారు. సుప్రీం కోర్టు రిజర్వేషన్లు మొత్తం 50 శాతం దాటకూడదని పరిమితి విధించడంతో 2019లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రిజర్వేషన్లను 22 శాతానికి కుదించి ఎన్నికలు నిర్వహించింది. బీసీలకు అన్యాయం జరిగినా జనరల్‌ స్థానాల్లో సత్తా చాటారు. ఈక్రమంలో శాసనసభ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగానే బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలుకు సిద్ధం చేశారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీల్లోనూ బీసీల హవా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో కూడా బీసీలు జనరల్‌ స్థానాల్లో హవా చూపారు. 12 జడ్పీటీసీ స్థానాల్లో ఆరు జనరల్‌ స్థానాలు, బీసీలు రెండు, ఎస్సీలు మూడు, ఎస్టీలకు ఒకటి రిజర్వ్‌ చేశారు. ఇందులో జనరల్‌ స్థానాల్లోనే ముగ్గురు గెలుపొందారు. రిజర్వేషన్‌తో కలిపి ఐదుగురు బీసీలు గెలుపొందారు. 123 ఎంపీటీసీ స్థానాల్లో జనరల్‌ స్థానాలు 64, బీసీలకు 25, ఎస్టీలకు 6, ఎస్సీలకు 28 స్థానాలు రిజర్వ్‌ చేశారు. ఇందులో జనరల్‌ స్థానాల్లో 17 బీసీ అభ్యర్థులు గెలుపొందారు. రిజర్వేషన్‌తో కలుపుకొని 42 ఎంపీటీసీ స్థానాల్లో మెజార్టీగా ఉన్నారు. ఈసారి స్థానాలు జడ్పీటీసీ ఎంపీటీసీ పెరగలేదు. సర్పంచ్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అధికార యంత్రాంగం చురుకుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే జడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించిన ఏర్పాట్లు చేయడంతో పాటు సర్పంచ్‌ ఎన్నికల కంటే ముందు పరిషత్‌ ఎన్నికలు వస్తాయని తెలుస్తోంది.

గత ఎన్నికల్లో 80 గ్రామపంచాయతీల్లో బీసీలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ఐదు గ్రామపంచాయతీలతో కలిపి 260 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 2019లో ఎన్నికలు జరిగిన సమయంలో జిల్లాలో 255 గ్రామపంచాయతీలు ఉండగా, 252 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 56 స్థానాలు, ఎస్సీలకు 51, ఎస్టీలకు 30, జనరల్‌ స్థానాలు 115 రిజర్వ్‌ చేశారు. ఇందులో జనరల్‌ స్థానాల్లో 24 మంది బీసీలు గెలుపొందారు. 252 స్థానాల్లో బీసీ రిజర్వేషన్లు కలుపుకొని 80 మంది బీసీలు గెలుపొందారు. ప్రస్తుతం జిల్లాలోని 260 గ్రామ పంచాయతీల్లో మొదటి విడతలో 137 సర్పంచ్‌లు, 1888 వార్డులు, రెండో విడతలో 123 సర్పంచ్‌లు, 1080 వార్డులకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Jul 13 , 2025 | 12:37 AM