రైతులకు శాపంగా బ్యాంకర్ల తప్పిదాలు
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:56 PM
బ్యాంకు అధికా రుల తప్పిదాలు కొందరు రైతులకు శాపంగా మారాయి. అర్హత ఉండి రుణ మాఫీ పొంద లేకపోతున్నారు. రైతులకు తెలియకుండానే పాత ఖాతాలను క్లోజ్ చేసి కొత్త ఖాతాలను తెరవడం వల్ల రుణ మాఫీ సొమ్ము ఖాతాల్లో పడినట్లే పడి తిరిగి వాపస్ వెళ్లడంతో పలువురు రైతులు లబోదిబోమంటున్నారు. తమకు రుణ మాఫీని వర్తింపజేయాలంటూ వ్యవసాయ శాఖాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

పెద్దపల్లి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): బ్యాంకు అధికా రుల తప్పిదాలు కొందరు రైతులకు శాపంగా మారాయి. అర్హత ఉండి రుణ మాఫీ పొంద లేకపోతున్నారు. రైతులకు తెలియకుండానే పాత ఖాతాలను క్లోజ్ చేసి కొత్త ఖాతాలను తెరవడం వల్ల రుణ మాఫీ సొమ్ము ఖాతాల్లో పడినట్లే పడి తిరిగి వాపస్ వెళ్లడంతో పలువురు రైతులు లబోదిబోమంటున్నారు. తమకు రుణ మాఫీని వర్తింపజేయాలంటూ వ్యవసాయ శాఖాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రూపాయల వరకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆగస్టు రెండో వారంలో రుణమాఫీ పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు పంట రుణాలు తీసుకున్నా రెండు లక్షల రూపాయల వరకు, ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిబంధనలను అనుసరించి రుణమాఫీని వర్తింపజేశారు. ఈ కార ణంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయ పన్ను చెల్లింపుదారులకు రుణమాఫీ కాలేదు. జిల్లాలో 60,619 మంది రైతులకు 455 కోట్ల 50 లక్షల రూపాయల వరకు రుణ మాఫీ చేశారు. ఇందులో కొందరి ఖాతాలు క్లోజ్ అయినందున రుణమాఫీ సొమ్ము తిరిగి ప్రభుత్వ ఖాతాల్లో జమఅయ్యాయి. బ్యాంకు అధికారుల నిర్వాకం వల్ల జిల్లాలో 617 మంది రైతులకు చెందిన 3 కోట్ల 46 లక్షల 66 వేల 168 రూపాయల రుణమాఫీ సొమ్ము తిరిగి వాపస్ వెళ్లడం గమనార్హం. ఆధార్ మిస్ మ్యాచింగ్ కారణాలతో జిల్లాలో 7,124 మంది రైతులకు 54 కోట్ల 48 లక్షల రూపాయల రుణ మాఫీ కాకుండా పోతున్నది. ఇలా పైరెండు కారణాల వల్ల వేలాది మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీని పొంద లేకపోతున్నారు. దీంతో సదరు రైతులు బ్యాంకులు, వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమకు తెలియకుండా ఖాతాలను ఎందుకు క్లోజ్ చేశారని బ్యాంకులకు వెళ్లి అధికారులను ప్రశ్నిస్తే జవాబులు రావడం లేదని చెబుతున్నారు. రెగ్యులర్‌గా వినియోగంలో ఉన్న ఖాతాలను క్లోజ్ చేయడానికి అసలు కారణాలు చెప్పడం లేదని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామని చెబుతున్నారు. ఇవేగాకుండా ప్రస్తుతం ఉన్న రుణ ఖాతాలు తెరిచినప్పుడు ఆధార్ నమోదు చేయని రైతుల ఖాతాల్లో మధ్యలో ఆధార్ నంబర్లను బ్యాంకు అధికారులు ఎంటర్ చేశారు. ఆ సమయంలో ఒకటి, రెండు నంబర్లు మిస్టేక్ పడిన కారణంగా అసలు ఆధార్ నంబర్‌తో ఖాతాలు మ్యాచ్ కానీ కారణంగా అనేక మంది రుణ మాఫీ పొందలేకపోయారు. అలాంటి వారి ఖాతాలను, ఆధార్ నంబర్లను సవరించేందుకు ప్రభుత్వం ఆప్షన్లు ఇచ్చింది. ఆ మేరకు వాటిని సవరించిన అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. సాంకేతికంగా అన్ని సక్రమంగా ఉన్న వారికే రుణ మాఫీ వర్తించగా, రేషన్ కార్డులు లేని రైతుల ఇళ్ల వద్దకు వ్యవసాయ శాఖాధికారులు వెళ్లి కుటుంబ సభ్యుల గ్రూపింగ్ చేసి యాప్‌లో వివరాలు నమోదు చేసి పంపిన వారికి నాలుగో విడతలో రుణ మాఫీ సొమ్మును వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఖాతాలు క్లోజ్ కావడం వల్ల వాపస్ వెళ్లిన రుణ మాఫీ సొమ్మును తిరిగి కొత్త ఖాతాల్లో జమ చేయాలని, ఆధార్ నంబర్ మిస్ మ్యాచింగ్ వల్ల రుణమాఫీ కానీ వారికి రుణమాఫీ వర్తింపజేసి ఆదుకోవాలని సంబంధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఖాతా క్లోజ్ చేశారు
రైతు గంట వెంకటేశ్‌ది పెద్దపల్లి జిల్లా రంగాపూర్ గ్రామం. పెద్దపల్లిలోని ఇండియన్ బ్యాంకు ద్వారా పంట రుణం తీసుకుంటున్నాడు. రెండు లక్షల రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం వెంకటేశ్ ఖాతా నంబర్ 6048271789లో వడ్డీతో కలుపుకుని రూ.72,569 జమ చేసింది. అయితే ఆ ఖాతా వెంకటేశ్‌కు తెలియకుండానే క్లోజ్ అయ్యింది. వచ్చిన డబ్బులు తిరిగి ప్రభుత్వానికి వాపస్ వెళ్లాయి. దీంతో రైతు వెంకటేశ్ లబోదిబోమంటున్నాడు.