పుష్కరకాలం తర్వాత స్వగ్రామానికి...
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:50 PM
మతిస్థిమితం లేక ఇంటిని, ఊరును, కన్నవారిని వదిలివెళ్లిన వ్యక్తి 12 సంవత్సరాల అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాడు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన పట్టెం వెంటకరాములు 25 ఏళ్ల వయసులో మానసిక స్థితి సరిగా లేకపోవ డంతో గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు.
పెద్దపల్లి రూరల్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): మతిస్థిమితం లేక ఇంటిని, ఊరును, కన్నవారిని వదిలివెళ్లిన వ్యక్తి 12 సంవత్సరాల అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాడు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన పట్టెం వెంటకరాములు 25 ఏళ్ల వయసులో మానసిక స్థితి సరిగా లేకపోవ డంతో గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు. తల్లితోపాటు బంధువులు, గ్రామస్థులు వెంకటరాములు కోసం తీవ్రంగా వెతికినా ఫలితం లేకుండా పోయింది. అతను అస్సాం రాష్ట్రంలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మాజీ సర్పంచ్ సహకారంతో తీసుకుని వచ్చారు. 12 ఏళ్ల అనంతరం శనివారం స్వగ్రామానికి చేరుకున్నాడు.
వివరాల్లోకి వెళితే అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో హోటల్ పనిచేశాడు. ఆ సమ యంలో అతనికి కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతాలకు చెందిన వారు పరిచయమయ్యారు. కొన్ని రోజుల తరు వాత తిరిగి అతను అస్సాంలోని సొంత గ్రామానికి వెళ్లి హోటల్ పెట్టుకున్నాడు. హోటల్ ఎదుట కనిపించిన వెంకటరాములును పిలిచి అడుగగా కరీంనగర్, రంగా పూర్, రాఘవపూర్ అంటూ పలు రకాల ఊరి పేర్లను తెలిపాడు. అస్సాంకి చెందిన వ్యక్తి అతడి ఫొటోను కరీంనగర్‌కు చెందిన వ్యక్తులకు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. దీంతో పెద్దపల్లి ప్రాంతానికి చెందిన కొందరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోను చూసి రంగాపూర్ గ్రామస్థుడిగా గుర్తుపట్టారు. అస్సాంకు చెందిన వ్యక్తి ఫోన్ నంబర్ తీసుకొని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా తల్లి రుక్కమ్మతో మాట్లాడించారు. అక్కడ ఉన్నది తమ కుమారుడేనని నిర్ధారించుకుని, తీసుకు రావాలని మాజీ సర్పంచ్ గంట లావణ్య- రమేష్‌కు కోరారు. మాజీ సర్పంచ్ ఆర్థికసాయం అందించి అస్సాం రాష్ట్రంలోని లాఖీంపూర్ జిల్లా భోగినాడులో ఉన్న వెంకటరాములు వద్దకు అతని బంధువులు ప్రసాద్, మహేష్‌లను వారం క్రితం వెళ్లగా శనివారం వెంకటరాములును తీసు కొచ్చారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన తరవాత అతను దేశంలో వివిధ ప్రాంతలలో తిరుగుతూ చివరకు అస్సాం రాష్ట్రం చేరుకున్నాడు. కుమారుడిని చూసి తల్లి ఆనందం వ్యక్తం చేసింది.