Share News

సింగరేణిలోని నాలుగు గనులకు అవార్డులు

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:48 AM

సింగరేణిలోని నాలుగు బొగ్గు గనులకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. గురువారం ముంబైలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌ అవార్డులు అందుకున్నారు.

సింగరేణిలోని నాలుగు గనులకు అవార్డులు

గోదావరిఖని, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): సింగరేణిలోని నాలుగు బొగ్గు గనులకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. గురువారం ముంబైలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌ అవార్డులు అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ అవార్డులు అందుకున్న సింగరేణి గనుల్లో రామగుండం ఏరియా-3కి చెందిన ఓసీపీ-1 ఎక్స్‌టెన్షన్‌, ఇల్లందు ఏరియాకు చెందిన జేకే-5 ఓసీపీతో పాటు భూగర్బ గనుల్లో శ్రీరాంపూర్‌ ఏరియాకు చెందిన ఆర్‌కే-6, ఆర్‌కే న్యూటెక్‌ గనులు ఉన్నాయి.

ఈ స్టార్‌ రేటింగ్‌ ఎంపికకు బొగ్గు గని పనితీరు, రక్షణ చర్యలు, నిర్వహణ, సౌకర్యాలు, పర్యావరణ హిత చర్యలు, కార్మిక సంక్షేమం లాంటి 84అంశాలను పరిగణలోకి తీసుకుని మార్కులు కేటాయించి ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రమాణాలు కలిగి ఉన్న గనులపై కేంద్ర బొగ్గు శాఖ నుంచి వచ్చిన పరిశీలక బృందం అత్తుత్తమ గనులను ఎంపిక చేస్తుంది. మొత్తం 100మార్కుల్లో 91 కన్నా ఎక్కువ మార్కులు సాధించిన గనులకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు. ఇవే కాకుండా సింగరేణిలోని మరో 14గనులు ఫోర్‌ స్టార్‌ల రేటింగ్‌లో నిలిచాయి. మరో 20గనులు త్రీ స్టార్‌ రేటింగ్‌ లభించింది. గతంలో ఎప్పుడు కూడా సింగరేణి బొగ్గు గనులు స్టార్‌ రేటింగ్‌ సాధించలేదు. ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌కు సింగరేణి నుంచి నాలుగు గనులు ఎంపిక కావడంపై సంస్థ సీఎండీ బలరాంనాయక్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆయా గనుల అధికారులకు, కార్మికులకు అభినందనలు తెలిపారు.

Updated Date - Sep 05 , 2025 | 12:48 AM