నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:37 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు.
పెద్దపల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు మండలాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఎంపీడీఓ కార్యాలయాల ఆవరణలో అవసరమైన కౌంటర్లు ఏర్పాటు చేసి ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు స్వీకరించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు ఎన్నికల నిర్వహణలో సంపూర్ణ మద్దతు ఎంపీడీఓ, ఎంపీఓలకు అందించాలన్నారు. ఎన్నికల విధుల్లో అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండేలా శిక్షణ అందించాలని అన్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత పోటీ అభ్యర్థుల ప్రకటన, వారికి గుర్తుల కేటాయింపు తదితర అంశాలపై పూర్తి శిక్షణ అందించాలని అన్నారు. మండలాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి అందిస్తామన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు అందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వీస్ ఓటర్లకు, పీడీ యాక్ట్ కింద అరెస్టయిన వారికి, ఎన్నికల విధులు నిర్వహించే వారికి పోస్టల్ బ్యాలెట్ జారీ చేస్తామని, ఓటర్ జాబితాలో పోస్టల్ బ్యాలెట్ జారీ చేయాల్సిన వారి పేర్లు రౌండప్ చేసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్ల వివరాలు, ఓటర్ జాబితా వివరాలు పోటీ చేసే అభ్యర్థులకు ఇవ్వాలన్నారు. నామినేషన్ కేంద్రాల 100 మీటర్ల పరిధిలో ఎటువంటి ర్యాలీ, ప్రచారాలకు అనుమతి లేవని, అభ్యర్థితోపాటు 10 మందిని మాత్రమే అనుమతించాలన్నారు. ఎన్నికల ప్రచార నిమిత్తం ర్యాలీ, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారానికి అనుమతి మంజూరు చేయాలని, సౌండ్ సెట్, వాహనానికి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలని, ఎక్కడ కూడా పోటీదారులకు ఒకే రూట్‌లో సమావేశాలు ర్యాలీల నిర్వహణకు అనుమతి జారీ చేయవద్దన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసేందుకు అక్రమంగా నగదు మద్యం తరలిస్తే సీజ్ చేస్తున్నామని అన్నారు. ఎన్నికల ఓట్ల కోసం కుల, మత విద్వేశాలు రెచ్చగొట్టకుండా చూడాలన్నారు. అధికారులు ఎన్నికల విధులను తమకు కేటాయించిన బుక్‌లెట్‌లోని నిబంధనల ప్రకారం పటిష్టంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల నిబంధనలపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. జడ్పీ సీఈఓ నరేందర్, డీపీఓ వీర బుచ్చయ్య, పెద్దపల్లి ఆర్‌డీఓ బి గంగయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.