Share News

పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:57 PM

సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలుకు రంగం సిద్ధమైంది. పత్తి విక్రయాలను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌ను తీసుకవ చ్చింది. ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని స్లాట్‌ బుకింగ్‌ చేస్తేనే ఎంపిక చేసుకున్న సీసీఐ కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాల్సి ఉంటుంది.

పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలుకు రంగం సిద్ధమైంది. పత్తి విక్రయాలను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌ను తీసుకవ చ్చింది. ఈ యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని స్లాట్‌ బుకింగ్‌ చేస్తేనే ఎంపిక చేసుకున్న సీసీఐ కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్‌ నుంచి కొత్తగా అమల్లోకి తీసుక రావడంతో రైతులకు మార్కె టింగ్‌ శాఖ, వ్యవసాయ శాఖాధికారుల సమన్వయంతో అవగాహన కల్పిస్తున్నారు. ఊరూరా గ్రామ పంచాయతీల ఆవరణలో కపాస్‌ కిసాన్‌ యాప్‌ గురించి, మద్దతు ధరలతో ముద్రించిన పోస్టర్లను అతికి స్తున్నారు. రైతువేదికల్లో వ్యవసాయ విస్తీర్ణాధికారులు రైతులతో నిర్వహించే సమావేశాల్లో యాప్‌ గురించి అవగాహన కల్పిస్తున్నారు. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి కపాస్‌ కిసాన్‌ యాప్‌ను ఓపెన్‌ చేసుకుని అందులో సెల్‌ నంబర్‌ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన తర్వాత రైతులు తమ వివరా లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. పత్తి పరిమాణంతోపాటు విక్రయించే సీసీఐ కేంద్రం, తేదీ నమోదు చేసుకున్న తర్వాత, ఆ రోజున కేంద్రానికి వెళ్లి పత్తిని విక్రయిం చుకోవాల్సి ఉంటుంది. అయితే వ్యవసాయ శాఖ ద్వారా పత్తి పంట నమోదు తప్పనిసరిగా ఉంటేనే స్లాట్‌ బుక్‌ అవుతుందని అధికారులు చెబుతున్నారు. పత్తి విక్రయించిన 72 గంటల్లోనే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఆధార్‌తో లింక్‌ ఉన్న బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. జిల్లాలో పెద్దపల్లి మండలంలోని నిట్టూరు, రాఘవాపూర్‌, కమాన్‌పూర్‌ మండలం గొల్లపల్లి, సుల్తానాబాద్‌ జిన్నింగ్‌ మిల్లులతో పాటు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మొత్తం ఐదు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఈ నెల 27న పెద్దపల్లిలోని రెండు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ఆరంభం కానున్నాయి.

మార్కెట్‌లో దక్కని మద్దతు ధరలు..

వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తికి మద్దతు ధరలు దక్కడం లేదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది 49,783 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. వర్షాలకు అక్కడక్కడ కొంత మేరకు పత్తి పంటకు నష్టం వాటిల్లింది. మొదటి దశ పత్తి కాతకు వచ్చింది. వారం రోజుల నుంచి రైతులు పత్తి ఏరుతున్నారు. వాతావరణం చల్లగా ఉండడంతో తేమ శాతం అధికంగా ఉంటుంది. దీంతో రైతులకు మద్దతు ధరలు దక్కడం లేదు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శుక్రవారం నుంచి పత్తి కొనుగోళ్లు ఆరంభం అయ్యాయి. మొదటి రోజు 349 మంది రైతులు 986 బస్తాల్లో 1010.90 క్వింటాళ్ల పత్తిని తీసుకవచ్చారు. గరిష్టంగా క్వింటాలుకు 7,011 రూపాయలు, కనిష్టంగా 5,210, మోడల్‌ ధర 6,750 రూపాయలు పలికింది. ప్రభుత్వ మద్దతు ధర 29.5-30.5 మిల్లీ మీటర్ల పింజ పొడవు గల పత్తికి క్వింటాలుకు 8,110 రూపాయలు, 29.01-29.49 పింజ పొడవు గల పత్తికి క్వింటాలుకు 8,060 రూపాయలు, 27.50-28.50 పింజ పొడవు గల పత్తికి క్వింటాలుకు 8,010 రూపాయల ధర విధించారు. కానీ పత్తిలో తేమ అధికంగా ఉందని మద్దతు ధరలు చెల్లించడం లేదని రైతులు వాపోతున్నారు.

తేమ శాతం 12కు మించితే కొనుగోలు చేయరు

పత్తిలో తేమ శాతం 12 శాతానికి మించితే సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేయరు. 12 శాతం వరకు మాత్రమే అనుమతిస్తారు. 8 శాతానికి మించి తేమ ఉంటే ధరల్లో కోత విధించనున్నారు. మొదటి రకం పత్తికి 8 శాతానికి మించకుంటే మద్దతు ధర క్వింటా లుకు 8,110 రూపాయలు, 9 శాతం ఉంటే 8,028 రూపాయలు, 10 శాతం ఉంటే 7,947.80 రూపాయలు, 11 శాతం ఉంటే 7,866.70 రూపాయలు, 12 శాతం ఉంటే 7,785.60 రూపాయల ధర చెల్లిస్తారని తెలిపారు. ‘ఆంధ్రజ్యోతి’తో జిల్లా మార్కెటింగ్‌ శాఖాధికారి ప్రవీణ్‌ రెడ్డి మాట్లాడుతూ కపాస్‌ కిసాన్‌ యాప్‌ గురించి గ్రామాల్లో రైతులకు వ్యవసాయ శాఖాధికారులతో కలిసి అవగాహన కల్పిస్తున్నామని, ఏమైనా సందేహాలు ఉంటే రైతులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 18005995779కు చేయాలని కోరారు.

Updated Date - Oct 25 , 2025 | 11:57 PM