ఏడాదంతా ‘స్థానిక’ ఆశలే..
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:36 AM
ఏడాదంతా ‘స్థానిక’ ఎన్నికల ఆశలతోనే రాజకీయ నేతలు ఎదురుచూడాల్సి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది జనవరి 25న సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. అంతకుముందు ఏడాదిలోనే పంచాయతీ, పరిషత్ పాలకవర్గాల కాలం ముగిసింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఏడాదంతా ‘స్థానిక’ ఎన్నికల ఆశలతోనే రాజకీయ నేతలు ఎదురుచూడాల్సి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది జనవరి 25న సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. అంతకుముందు ఏడాదిలోనే పంచాయతీ, పరిషత్ పాలకవర్గాల కాలం ముగిసింది. ఎమ్యెల్సీ ఎన్నికలు హాడావుడి పెంచింది. ఇదే క్రమంలో ఈ సంవత్సరం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తారని ప్రభుత్వ నుంచి తరచూ వచ్చిన సంకేతాలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఆశావహులు ఎన్నో ఆశలతో ఎదురుచూసినా చివరకు పంచాయతీ ఎన్నికలకే పరిమితమైంది. ప్రధాన పార్టీలు, వామపక్ష పార్టీల నిరసనలు ఆందోళనతో 2025 సంవత్సరం గడిచిపోతున్న కాల గమనంలోకి వెళ్తే.. కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సమయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు హామీ నిలబెట్టుకునే ప్రయత్నం ఈ సంవత్సరం చేసింది. పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, జడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లను 42 శాతం బీసీలకు కేటాయిస్తూ ముందుకు సాగింది. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది గవర్నర్, రాష్ట్రపతి వద్దకు పంపిన పెండింగ్‌లోనే ఉండిపోయింది. జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజునే హైకోర్టు జోక్యంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. చివరకు పాత రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వెళ్లారు. పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు నిరీక్షణ మాత్రం మిగిలింది.
విలక్షణంగా పంచాయతీ పోరు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు విలక్షణంగా ముగిసాయి. రెండేళ్లుగా పాలకవర్గాలు లేక గ్రామాల అభివృద్ధి కుంటపడింది. నిధులు లేక పల్లెల్లో అనేక పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈక్రమంలో ముందుకు వచ్చిన పంచాయతీ ఎన్నికలు విలక్షణంగా జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, 2268 వార్డులకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ గట్టి పోటీని ఇచ్చింది. బీజేపీ తనదైన శైలిలో ఉనికి చాటుకుంది. 260 సర్పంచ్ స్థానాల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కే తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పట్టు నిలుపుకోగా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణలు తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న బోయినపల్లి, ఇల్లంతకుంటలో కాంగ్రెస్ పట్టు సాధించింది. జిల్లాలోని బలాబలాలు చూస్తే బీఆర్‌ఎస్ అధికారంలో లేకపోయినా బలంగా నిలబడగలిగిందని చెప్పుకోవచ్చు. జిల్లాలో 260 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ 96 స్థానాలు, బీఆర్‌ఎస్ 106 స్థానాలు, బీజేపీ 21 స్థానాలు, సీపీఎం ముగ్గురు ఇతరులు 34 మంది గెలుపొందారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ జిల్లాలోని సీట్లలో సగంసగం పంచుకోగా, ఎన్నికల తర్వాత సర్పంచులు కాంగ్రెస్‌లో చేరికలు మొదలయ్యాయి.
మున్సిపల్, పరిషత్‌కు నిరీక్షణ
జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్, 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలతో పాటు సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీల ఎన్నికలు ఇదే సంవత్సరం పూర్తిచేస్తారని భావించారు. ఇదే క్రమంలో వ్యవసాయ పరపతి సంఘాల పాలకవర్గాల గడువు పొడిగిస్తూ వచ్చిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు ముగియడంతోనే వాటి పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో మున్సిపల్, పరిషత్, సొసైటీల పాలకవర్గాల కోసం ఆశావహులు నిరీక్షించే పరిస్థితి మొదలైంది. 42 శాతం రిజర్వేషన్లతో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల వరకు వెళ్లిన చివరకు నిలిచిపోయి ఎదురుచూపులను మిగిల్చింది.
నిరాశపరిచిన నామినేటెడ్ పోస్టులు
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న గత సంవత్సరం మార్కెట్ కమిటీల నామినేట్ పోస్టులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోస్ట్ వరకే పరిమితమైంది. ఈ సంవత్సరం నామినేట్ పోస్టులు ఇస్తామని ప్రకటించిన ఆచరణలోకి రాలేదు. కార్పొరేషన్ స్థాయి నుంచి వేములవాడ దేవస్థానం వరకు నామినేటెడ్ పోస్టుల కోసం పార్టీలోని సీనియర్ నాయకులు ఎదురుచూస్తున్నారు. పార్టీ పోస్టులు కూడా అందుకోలేకపోయారు.
నిరసనలు.. ఆందోళనలు
జిల్లాలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు వివిధ సమస్యలపై నిరసనలు, ఆందోళనలు నిర్వహించాయి. బీఆర్‌ఎస్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరుపై నిరసనలు వ్యక్తం చేసింది. కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయగా వామపక్ష ిసీపీఐ, సీపీఎం ఇతర పార్టీలు కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై ఆందోళనలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలుపుకోలేదని బీఆర్‌ఎస్ నిరసనలు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ జిల్లాలో పలు నిరసన కార్యక్రమాలను చేపట్టింది. జిల్లాలో ప్రోటోకాల్ వివాదాలు కూడా తెరపైకి వచ్చాయి. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయం ముట్టడి చేసింది. బీఆర్‌ఎస్ నాయకులు వారిని అడ్డుకోవడంతో లాఠీ చార్జి వరకు వెళ్ళింది. బీజేపీ, బీఆర్‌ఎస్ రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి. యూరియా కొరతపై రైతులతో కలిసి బిఆర్‌ఎస్ ఆందోళనలో పాల్గొన్నాయి. కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు అయిన సందర్భంగా బీజేపీ ర్యాలీ నిర్వహించింది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి బండి సంజయ్ విద్యార్థులకు సైకిల్ పంపిణీ, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ వంటి కార్యక్రమాలు జిల్లాలో చేపట్టారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో బిజీగా మారారు. జిల్లాలో వివాదాస్పద జిల్లా కలెక్టర్‌గా చర్చల్లో మిగిలిన సందీప్ కుమార్ ఝా ఫోటో కాల్ వివాదంలోనే బదిలీ అయ్యారు. ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్‌కు కలెక్టర్ కు మధ్య ఏర్పడిన వివాదం చివరకు రాష్ట్రస్థాయిలో చర్చకు దారి తీసింది.
కాంగ్రెస్, బీజేపీలకు కొత్త అధ్యక్షులు
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొత్త జిల్లా అధ్యక్షులను నియమించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్‌ను ఏఐసీసీ నియమించగా ప్రమాణ స్వీకారం ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. మంత్రి పొన్న ప్రభాకర్, మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రెడ్డబోయిన గోపిని నియమించారు. దీంతోపాటు మీద కమిటీలను కూడా వేశారు.