Share News

కార్యాలయాలన్నీ ఒకే చోట

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:02 AM

మంథని డివిజన్‌లోని ప్రజలందరికి త్వరలోనే వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు పలు ప్రభుత్వ శాఖల్లో వివిధ పనుల నిమిత్తం రోజుల తరబడి వేర్వేరు కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగి ఇబ్బందులు పడుతున్నారు.

కార్యాలయాలన్నీ ఒకే చోట

మంథని, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మంథని డివిజన్‌లోని ప్రజలందరికి త్వరలోనే వివిధ ప్రభుత్వ శాఖల సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు పలు ప్రభుత్వ శాఖల్లో వివిధ పనుల నిమిత్తం రోజుల తరబడి వేర్వేరు కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగి ఇబ్బందులు పడుతున్నారు. మంథని డివిజన్‌ కేంద్రంగా ఏర్పాటై దాదాపు 40 ఏళ్ళు గడిచిన ఇప్పటి వరకు డివిజన్‌ స్థాయిలో ఒకే చోట కార్యాల యాలు ఏర్పాటు కాలేదు. ఇప్పటికి పలు ప్రభుత్వ శాఖలకు డివిజన్‌, మండల స్థాయిలో సొంత భవనాలు లేవు. ఉన్న వాటిలో చాలా వరకు శిథిలావస్థలకు చేరుకున్నాయి. అరకొర వసతులతో ఇటు అధికారులు, సిబ్బంది, అటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్‌ స్థాయి సమీకృత భవన సముదాయ నిర్మాణం పూర్తయితే ఈ ఇబ్బందులు తప్పనున్నాయి.

కార్యాలయాలకు సొంత భవనాలు కరువు..

భవనాలు నిర్మించాల్సిన ఆర్‌అండ్‌బీ డివిజన్‌ స్థాయి కార్యాలయాన్ని ఆశాఖ గెస్టుహౌజ్‌లో ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్‌ ఏడీఏ ఆఫీసును మండల పరిషత్‌ కార్యా లయ గెస్టుహౌజ్‌లో నిర్వహిస్తున్నారు. ఐబీ డీఈ ఆఫీ సును మహిళా భవనంలో నిర్వహిస్తున్నారు. ఐసీడీఎస్‌ సీడీపీవో కార్యాలయాన్ని మండల పరిషత్‌లోని గోదాం షెటర్‌ నిర్వహిస్తున్నారు. ఐబీ ఈఈ ఆపీసును రామగిరి మండలంలోని సెంటినరీకాలనీలో సింగరేణి భవనంలోకి తరలించారు. లేబర్‌ ఆఫీసు, ఏఎస్‌డబ్ల్యూవో ఆఫీసులు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇలా అనేక ప్రభు త్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక, ఉన్న భవ నాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటు కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, పనుల నిమిత్తం వెళ్ళే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇంటిగ్రేటెడ్‌ భవన నిర్మాణానికి మంత్రి చొరవ..

కలెక్టరేట్‌ భవన నిర్మాణం మాదిరిగా ఇంటిగ్రేటెడ్‌ భవన నిర్మానానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు చొరవ చూపారు. అన్ని ప్రభుత్వ కార్యాల యాలన్ని ఒకే చోట ప్రజలకు పరిపాలన పరంగా సేవలు అందించే విధంగా ఆలోచన చేశారు. ప్రస్తుతం ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలు, గతంలో పాత ఆర్డీవో ఆఫీసు ఉన్న పాత స్థలం కలుపుకొని ఒకే చోట డివిజనల్‌ స్థాయి ఇంటిగ్రేటెడ్‌ బిల్డింగ్‌ నిర్మించాలని సంకల్పించారు. ప్రభుత్వం రూ.4.50 కోట్లతో భవనాన్ని జీప్లస్‌-2 నమునాలో మంజూరు చేయించారు. భవన నిర్మాణానికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా నిర్మించే భవన నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేశారు.

ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలు ఖాళీ..

ప్రస్తుతం ఉన్న ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాను బుధవారం ఖాళీ చేశారు. ఆర్డీవో ఆఫీసును బస్‌ డిపో సమీపంలోని ప్రైవేట్‌ భవనంలోకి తరలించారు. తహసీ ల్దార్‌ కార్యాలయాన్ని స్థానిక ఇంటిగ్రేటేడ్‌ ఎస్సీ హాస్టల్‌ లోని ఫస్ట్‌ఫ్లోర్‌కి మార్చారు. ఈ మేరకు రెండు ఆఫీసు ల్లోని సామగ్రిని తరలించారు. ఆర్డీవో ఆఫీసును సైతం ఇదే హాస్టల్‌లోని సెకండ్‌ ఫ్లోర్‌లోకి మార్చాలని అధికా రులు అనుకున్నప్పటీకి అనివార్య కారణాలతో ప్రైవేట్‌ బిల్డింగ్‌లోకి తరలించారు. ఇక నుంచి ప్రజలకు పాలన పరంగా రెవెన్యూ అధికారులు సేవలందించనున్నారు.

ఆధునిక హంగులతో భవన నిర్మాణం..

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ మాదిరిగా అన్ని ఆధునిక హంగులతో 18 ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాలను ఒకే చోట నిర్వహించడానికి ఈ ఇం టిగ్రేటేడ్‌ భవనాన్ని నిర్మిస్తున్నారు. సుమారు 15 గుం టల్లో జీఫ్లస్‌-2 మోడల్‌లో భవనాన్ని నిర్మించనున్నారు. డివిజన్‌, మండల స్థాయిలో 18 శాఖల ఆఫీసుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా గదులను నిర్మించను న్నారు. ఉద్యోగుల కార్యాలయ నిర్వాహణ, పనుల నిమిత్తం వచ్చే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని భవనాన్ని నిర్మిస్తున్నారు. భవనంలో మీటింగ్‌ హాల్‌, వీడియో కాన్ఫెర్స్‌ హాల్‌, పబ్లిక్‌ వెయిటింగ్‌ హాల్‌, పార్కింగ్‌, పబ్లిక్‌ టాయిలెట్స్‌, గ్రీనరీ స్పేస్‌ ఇలా అనేక సౌకర్యాలతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవనంతో మంథనికి నూతన కళ వచ్చే అవకాశం ఉంది. మరో ఏడాదిలో భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Nov 21 , 2025 | 12:02 AM