అందరి దృష్టి హైకోర్టు తీర్పుపైనే!
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:06 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌పై ఈనెల 8న హైకోర్టు తీర్పుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి సంఘం ప్రతినిధి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఈనెల 8వ తేదీన తుది తీర్పు వెలువడనుంది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌పై ఈనెల 8న హైకోర్టు తీర్పుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి సంఘం ప్రతినిధి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఈనెల 8వ తేదీన తుది తీర్పు వెలువడనుంది. వంగా గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌ను సోమవారం విచారణకు చేపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టులో పిటిషన్ విచారణలో ఉండగా, అక్కడే తేల్చుకోవాలని పిటిషన్ కొట్టి వేసింది. దీంతో ప్రభుత్వానికి కొంత ఊరట లభించినప్పటికీ, హైకోర్టు తుది విచారణ అనంతరం ఎలాంటి తీర్పును వెలు వడనుందనే దాని పైనే ప్రభుత్వం ఎలా ముందుకు పోవాలని భావిస్తున్నది.
2023 చివరలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ప్రకటించింది. ఆ మేరకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. గత ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామ పంచాయతీల పాలక వర్గాలు, అదే ఏడాది జూలైలో మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. అలాగే ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో కుల గణన చేపట్టింది. అలాగే బీసీ డెడికేషన్ కమిషన్ కూడా వేసింది. తద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లులను రూపొందించి సభలో ప్రవేశ పెట్టి ఆమోదం పొందింది. ఆ తర్వాత ఆ బిల్లులు గవర్నర్‌కు పంపించారు. అనంతరం ప్రత్యేకంగా ఆర్డినెన్స్‌లను కూడా తీసుకువచ్చి గవర్నర్‌కు పంపిం చారు. రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ప్రభుత్వం 2018 పంచాయతీ చట్ట సవరణ చేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సెప్టెంబర్ నెలాఖరులో జీవో నంబర్ 9 తీసుకు వచ్చింది. ఆ వెంటనే రిజర్వేషన్లు ఖరారు చేసి మండల, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏకకాలంలో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. జీవో 9ను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి సంఘం ప్రతినిధి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఈనెల 8న తుది విచారణ జరగనుం డడంతో ఏం జరగనున్నదో ఏమీ జరగనున్నదనే ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం హైకోర్టు బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునిస్తే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగను న్నాయి. ఒకవేళ ప్రతికూలంగా తీర్పు వెలువరిస్తే మాత్రం రిజర్వేషన్లలో మార్పులు జరగనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించాల్సి రావడంతో ఇప్పుడు చేసిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు స్థానాలు తగ్గి జనరల్‌కు పెరగనున్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.