పూర్వ ప్రాథమిక విద్యతో బలమైన పునాది
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:48 PM
పూర్వ ప్రాథమిక విద్యతో పిల్లల భవిష్యత్‌కు బలమైన పునాది పడుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం పెద్దపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ పిల్లలకు స్కూల్ యూనిఫాం, లెర్నింగ్ మెటీరియల్, ఆట వస్తువులు అందించారు.
పెద్దపల్లి కల్చరల్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పూర్వ ప్రాథమిక విద్యతో పిల్లల భవిష్యత్‌కు బలమైన పునాది పడుతుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం పెద్దపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ పిల్లలకు స్కూల్ యూనిఫాం, లెర్నింగ్ మెటీరియల్, ఆట వస్తువులు అందించారు. ఆయన మాట్లాడుతూ పిల్లలకు బలమైన పునాది అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పూర్వ ప్రాథమిక పాఠశా లలను ఏర్పాటు చేసిందన్నారు. తల్లితండ్రులు తమ పిల్లలను రోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలన్నారు. ప్రభుత్వం కల్పి స్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ దశలో అందించే విద్య, ఆటలు అభ్యాస సామగ్రి పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు. జిల్లాలో మొత్తం 58 పూర్వ ప్రాథమిక పాఠశాలలు నడుస్తున్నాయని, వాటికి అదనంగా మరో ఐదు పీఎంశ్రీ పూర్వ ప్రాథమిక పాఠశాలలు పని చేస్తున్నాయని, మొత్తం 720 మంది విద్యార్థులు విద్య పొందుతున్నారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా వారి తల్లితండ్రుల విశ్వాసం పొందేలా ప్రభుత్వం పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు.