Share News

ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర..

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:51 PM

జిల్లాలోని ఐదు మండలాల్లో జరిగే తొలి విడుత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ విజయం కోసం మిగిలిఉన్న చివరి అస్త్రాలపై దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారం ముగి సిన పోలింగ్‌కు మరో 48 గంటల సమయం ఉండటంతో తమ విజయం కోసం గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్ల ప్రసన్నం కోసం నానా తంటాలు పడుతున్నారు.

ప్రచారానికి తెర.. ప్రలోభాలకు ఎర..

మంథని, డిసెంబరు 9 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని ఐదు మండలాల్లో జరిగే తొలి విడుత పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ విజయం కోసం మిగిలిఉన్న చివరి అస్త్రాలపై దృష్టి సారించారు. ఎన్నికల ప్రచారం ముగి సిన పోలింగ్‌కు మరో 48 గంటల సమయం ఉండటంతో తమ విజయం కోసం గ్రామాల్లో సర్పంచ్‌, వార్డు స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్ల ప్రసన్నం కోసం నానా తంటాలు పడుతున్నారు. గురువారం జిల్లాలోని 95 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, 685 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. షెడ్యూల్‌ ప్రకారం జిల్లాలో 99 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా మంథని మండలంలోని నాగారం, మైదుపల్లి, తోటగోపయ్యపల్లి, రామగిరి మండలంలోని చందనాపూర్‌ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లాలోని 896 వార్డులు ఉండగా వాటిలో 211 వార్డుల్లో వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంథని మండలం లోని-32, కమాన్‌పూర్‌-9, ముత్తారం-15, రామగిరి-15, కాల్వ శ్రీరాంపూర్‌-24 గ్రామ పంచాయతీల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు సర్పంచ్‌, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రం నుంచి రాత్రివరకు గ్రామాల్లో కొత్త సర్పంచ్‌లు,

వార్డు సభ్యులు కొలువుదీరనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో విజయం కోసం వారం రోజులుగా గ్రామంలో, వార్డుల్లో ఓటర్లను నేరుగా కలిసి ఎన్నికల ప్రచారం చేసి తమ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ప్రాధేయపడ్డ అభ్యర్థులు వారిని మచ్చిక చేసుకోవటానికి కావాల్సిన వనరులపై దృష్టి సారించారు. గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వారిని నమ్మించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు అభ్యర్థులు తమ విజయం కోసం చివరి అస్త్రంగా మద్యం, నగదు, ఇతర బహుమతులు పంపిణీ చేసేయటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ సాగుతోంది. దీంతో ఓటర్ల ప్రసన్నం కోసం ప్రయత్నాలు, పోలింగ్‌, ఎన్నికల ఫలితాలతో బుధ, గురువారాల్లో పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగనుంది. గురువారం రాత్రి వరకు తొలి విడుతలో జరిగే 95 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ పోరు ముగియనుంది.

Updated Date - Dec 09 , 2025 | 11:51 PM