మల్యాలపల్లి శివారులో పెద్దపులి సంచారం
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:17 PM
ఐదు రోజులుగా మేడిపల్లి ఓపెన్‌కాస్టు శివారులో సంచరించిన పులి శుక్రవారం మల్యాలపల్లి శివారులో కనిపించింది. మల్యాలపల్లి గ్రామానికి చెందిన కొమురమ్మ మేకలను మేపడానికి వెళ్లగా పెద్దపులి కనిపించిందని, ఆమె కేకలు పెడుతూ గ్రామానికి చేరుకొని ప్రజలకు తెలపడంతో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో పరిశీలించగా పులి అడుగులు గుర్తించారు.
గోదావరిఖని/పాలకుర్తి/అంతర్గాం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఐదు రోజులుగా మేడిపల్లి ఓపెన్‌కాస్టు శివారులో సంచరించిన పులి శుక్రవారం మల్యాలపల్లి శివారులో కనిపించింది. మల్యాలపల్లి గ్రామానికి చెందిన కొమురమ్మ మేకలను మేపడానికి వెళ్లగా పెద్దపులి కనిపించిందని, ఆమె కేకలు పెడుతూ గ్రామానికి చేరుకొని ప్రజలకు తెలపడంతో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలో పరిశీలించగా పులి అడుగులు గుర్తించారు. మేడిపల్లి ఓసీపీ క్వారీలో, డంప్ యార్డులో సంచరించిన పులి రామునిగుండాల గుట్టను దాటుకుని మల్యాలపల్లి వైపు వచ్చి మల్యాలపల్లి, బీపీఎల్ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు ఫారెస్టు అధికారులు గుర్తించారు. మల్యాలపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్టు అధికారులు సూచించారు. బీపీఎల్ సమీప గ్రామాల రైతులు ఉదయం 7 గంటల లోపు పంటపొలాల వద్దకు వెళ్లవద్దని తెలిపారు. ప్రజలు ఒంటరిగా గ్రామ శివారు ప్రాంతాల్లో సంచరించవద్దని, అత్యవసరం అనుకుంటే గుంపులు గుంపులుగా వెళ్లాలన్నారు. పులి సంచరించినట్లు తెలిసిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఫారెస్ట్ అధికారులు కొమురయ్య, దేవదాసు, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ రహ్మతుల్లా, బీట్ ఆఫీసర్లు మేఘరాజు, వరప్రసాద్, సిబ్బంది శ్రీనివాస్, శేఖర్ తదితరులున్నారు.