విచ్చలవిడి నీటి వినియోగానికి చెక్
ABN , Publish Date - Feb 11 , 2025 | 12:33 AM
జిల్లాలోని పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపారపరంగా విచ్చలవిడిగా వాడు తున్న నీటి వినియోగానికి భూగర్భ జల శాఖాధికారులు చెక్ పెట్టను న్నారు. జీవో 15ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నో అబ్జెక్టన్ సర్టిఫికెట్
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలోని పరిశ్రమలు, వాణిజ్య, వ్యాపారపరంగా విచ్చలవిడిగా వాడు తున్న నీటి వినియోగానికి భూగర్భ జల శాఖాధికారులు చెక్ పెట్టను న్నారు. జీవో 15ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నో అబ్జెక్టన్ సర్టిఫికెట్ లేకుండా బోర్ వాటర్‌ను వినియోగి స్తున్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. విచ్చలవిడిగా భూగర్భ జలాలను వినియోగించకుండా ఉండేందుకు వాల్టా చట్టం 2004ను కఠినంగా అమలు చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో 2023 మే 27న జీవో 15ను తీసుక వచ్చింది. ఈ జీవో ప్రకారం వ్యవసాయ, గృహ అవసరాలకు వేసిన బోర్లకు కాకుండా, పరిశ్రమలు, ఇతర వాణిజ్య, వ్యాపారపరంగా బోర్లు వేసి నీటిని వాడుతున్న యజమానులు తప్పని సరిగా నో అబ్జక్షన్ సర్టిపికెట్ తీసుకోవాలనే నిబంధన విధించింది. పరిశ్రమల పరంగా రైస్‌మిల్లులు, గ్రానైట్ క్వారీలు, సిమెంట్, గ్రానైట్ పరిశ్రమలు, క్రషర్లు, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, హోటళ్లు, ఇటుక బట్టీ పరిశ్రమలు, ప్యురీఫైడ్ వాటర్ ప్లాంట్లు, ఫంక్షన్ హాళ్లు, తదితర వాణిజ్య, వ్యాపార సంస్థలు ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో కేవలం 45 మాత్రమే ఎన్‌వోసీలు తీసుకున్నారు. పలువురికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వాటి గడువు ముగిసిన తర్వాత జరిమానాలు విధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఎన్‌వోసీ చెల్లింపులు ఇలా..
పరిశ్రమలు, ఇతరత్రా వాణిజ్య అవసరాలకు తీసుకునే ఎన్‌వోసీలను పలు కేటగిరీల ప్రకారం ఇవ్వనున్నారు. వాటి గడువు ముగిసిన తర్వాత మళ్లీ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రిటికల్ అండ్ సెమిక్రిటికల్ అండ్ సేఫ్ విభాగంలో ఉత్పాదక పరిశ్రమల్లో తాగడానికి, వాణిజ్య అవసరాలకు ఇచ్చే ఎన్‌వోసీ 5 సంవత్సరాల వరకు, పరిశ్రమలు, బల్క్ వాటర్ సప్లయ్, ప్యాకెజ్డ్ డ్రింకింగ్ సప్లయ్ చేసే వాళ్లకు 3 సంవత్సరాల వరకు, మైనింగ్ పరిశ్రమలకు 2 సంవత్సరాల వరకు, ఇతరత్రా అవసరాలకు ఎన్‌వోసీ 2 సంవత్సరాల వరకు గడువు ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత నిర్ణీత రుసుం చెల్లించి రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఉత్పాదక పరిశ్రమలకు కొత్తగా ఎన్‌వోసీ పొందాలనుకునే వారు రూ.10 వేలు, రెన్యూవల్ చేసుకున్నప్పుడు రూ.5లు చెల్లించాల్సి ఉంటుంది. పరిశ్రమలు, వాణిజ్య అవసరాలు, వాటర్ ప్లాంట్ల వాళ్లు నెలకు 25 వేల లీటర్ల నీటి వాడకానికి రూ.14,500, ఆపై 50 వేల లీటర్ల నీటి వాడకానికి రూ.18 వేలు, ఆపై లక్ష లీటర్ల నీటి వాడకానికి రూ.32 వేలు, లక్షకు పైగా నీటిని వినియోగించుకునే వాళ్లు రూ.42 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
ముందుకు రాని వ్యాపారులు..
పరిశ్రమలు, ఇతరత్రా వాణిజ్య, వ్యాపారాల కోసం బోర్లను వినియోగిస్తున్న వాళ్లు భూగర్భ జల శాఖ నుంచి ఎన్‌వోసీ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. సరైన అవగాహన లేని కారణంగా కొందరు, ఉన్నా కూడా తీసుకునేందుకు ముందుకు రాని వారు కొందరు ఉన్నారు. జిల్లాలో 180కి పైగా రైస్ మిల్లులు, 120కి పైగా ఇటుక బట్టీలు,, 50కి పైగా పెట్రోల్ పంపులు, 30కి పైగా ఫంక్షన్ హాళ్లు, అనేక హోటళ్లు, వాటర్ ప్లాంట్లు, చిన్న చిన్న పరిశ్రమలు, ఇతరత్రా డొమెస్టిక్ అవసరాల కోసం అనేక మంది బోర్లు వేసుకుని నీటిని వాడుకుంటున్నారు. వారంతా ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ తీసుకోవడం లేదు. జీవో జారీ అయి ఇరవై మాసాలు గడుస్తున్నప్పటికీ కేవలం 45 మంది మాత్రమే ఎన్‌వోసీ తీసుకున్నారు. ఈ విషయమై కలెక్టర్ చొరవ తీసుకుంటేనే విచ్చలవిడిగా వినియోగిస్తున్న నీటి వినియోగాన్ని అరికట్ట గలుగుతారు.
ఎన్‌వోసీ తీసుకోని వారికి నోటీసులు జారీ
- గీకురు లావణ్య, జిల్లా భూగర్భ జల శాఖ ఏడీ
జిల్లాలో జీవో 15 అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. జీఓ పరిధిలోకి వచ్చే పరిశ్రమలు, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్థలను గుర్తిస్తున్నాం. పరిశ్రమలను సందర్శించి యజమానులకు ఎన్‌ఓసీ తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. ఎన్‌వోసీ తీసుకోని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. అయినా ఎన్‌వోసీ తీసుకోనట్లయితే జరిమానాలు విధిస్తాం. జిల్లాలో రైసుమిల్లులు, ఇటుక బట్టీల పరిశ్రమలు చాలా ఉన్నాయి. వాటిని సందర్శించి వివరిస్తాం. ప్రభుత్వ నిబంధనలను పాటించాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం.