Kurikyala Government School: బాలికల బాత్రూములో సీక్రెట్ కెమెరా.. మహిళా కమిషన్ సీరియస్
ABN , Publish Date - Oct 28 , 2025 | 10:26 PM
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గవర్నమెంట్ స్కూల్‌లోని బాలికల బాత్రూములో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డ ఘటనలో ప్రధానోపాధ్యాయురాలిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
కరీంనగర్, అక్టోబర్ 28: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గవర్నమెంట్ స్కూల్‌లోని బాలికల బాత్రూములో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డ ఘటనలో ప్రధానోపాధ్యాయురాలిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అటెండర్ యాకుబ్ పాషా బాత్‌రూమ్‌లో కెమెరా పెట్టి వీడియో చిత్రీకరించినట్లు బాలికలు తెలపడంతో విషయం వెలుగుచూసింది. బాలికలు అప్రమత్తమై కెమెరా ఉందని గ్రహించి స్కూల్ టీచర్లకు తెలియజేశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. బాలికల బాత్ రూముల్లో కెమెరా పెట్టడాన్ని కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద తీవ్రంగా ఖండించారు. విద్యాసంస్థల్లో చదువుకునే బాలికల భద్రత, గౌరవం పట్ల నిర్లక్ష్యాన్ని ఏ రూపంలోనూ సహించబోమని హెచ్చరించారు. ఈ విషయంపై తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యాసంస్థలు విద్యార్థినులకు స్వేచ్ఛాయుత, సురక్షితమైన వాతావరణం కల్పించాలని అన్నారు వారిపై ఎలాంటి వేధింపులు, అనుచిత ప్రవర్తనను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం అన్ని పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. ఈ కేసు పురోగతిని మహిళా కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పారు. బాధిత బాలికలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
Kavitha: సొంత జిల్లాకు సీఎం తీరని అన్యాయం చేస్తున్నారు: కవిత
Minister Seethakka: మా కేబినెట్‌ను దండుపాళ్యం బ్యాచ్ అంటే దంచికొడతాం: సీతక్క