Kalyani Chalukyas: కళ్యాణి చాళుక్యుల శాసనాల గుర్తింపు
ABN , Publish Date - Feb 17 , 2025 | 01:51 AM
సంపత్‌కుమార్ అనే ఉపాధ్యాయుడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రాథమికంగా పరిశీలన జరిపి 3 శాసనాలను కనుగొన్నామని చెప్పారు.

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్‌లో వెలుగులోకి
వికారాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కళ్యాణి చాళుక్యుల శాసనాలను వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామంలో గుర్తించామని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. సంపత్‌కుమార్ అనే ఉపాధ్యాయుడు ఇచ్చిన సమాచారం మేరకు ప్రాథమికంగా పరిశీలన జరిపి 3 శాసనాలను కనుగొన్నామని చెప్పారు. ఆదివారం స్థానిక వీరభద్ర దేవాలయ ప్రాంగణంలో ఈ శాసనాలను పురావస్తు పరిశోధకుడు రామోజు హరగోపాల్ అధ్యయనం చేశారు. అవి కళ్యాణి చాళుక్య చక్రవర్తి భూలోక మల్లదేవన, 3వ సోమేశ్వరుడి కాలానికి చెందినవిగా భావిస్తున్నట్లు తెలిపారు. క్రీ.శ.1129, 1130, 1132లలో ఈ శిలాఫలకాలను రూపొందించినట్లు చెప్పారు. వాటి మీద భూమి, నగదును దానం చేసినట్లు ఉందని వివరించారు. మొదటి శిలాఫలకంపైన ఉన్న శాసనంలో స్థానిక పాలకుడు బెజ్జరస తన పేరున బెజ్జేశ్వరుడిని ప్రతిష్టించి, 100 మర్తురుల భూమిని దానం చేశారని ఉందని, రెండో శాసనంలో మహా మండలేశ్వర సోవిదేవప్రగ్గడ, బెజ్జరస, బెజ్జేశ్వర దేవర అంగరంగ భోగాలకు 100 మర్తురుల భూమి, నగదును దానం చేసినట్లు ఉందని వివరించారు. రెండో శిలాఫలకంపై ఉన్న మూడో శాసనంలో కంకల్ల - 24 కంపణంలోని కంకల్ నగరానికి చెందిన బెజ్జేశ్వరస్వామికి వివిధ దానాలు చేసిన వివరాలు ఉన్నాయని హరగోపాల్ తెలిపారు.
Also Read:
గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..
భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..
For More National News and Telugu News..