Kalvakuntla Kavitha: వరదల్లో మునిగిన వారికి ఇంకా పరిహారం అందలేదు: కవిత
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:48 AM
ప్రెంచ్ విప్లవం నియంతృత్వాన్ని పడగొట్టిందని.. తెలంగాణలో కూడా ఆత్మగౌరవం కోసం జాగృతి పోరాడుతుందని కవిత వ్యాఖ్యానించారు. మేడారం పనుల టెండర్లలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆమె స్థానిక మీడియాతో మాట్లాడారు.
వరంగల్, నవంబర్ 9: వరంగల్ వరదల్లో మునిగిన వారికి ఇంకా పరిహారం అందలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి 15 రోజులైనా పరిహారం అందలేదని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాగృతి నిర్వహిస్తున్న జనంబాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలోని దేవీ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రకాళి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు.. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో పర్యటిస్తూ స్థానిక మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనపై ఆంక్షలు పెట్టారని అన్నారు. ప్రోటోకాల్ నిబంధనలతో తనను కట్టేశారని చెప్పారు. అందుకే జనంలో తిరగలేక పోయాననిఅన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రి కూతురునైనా పనులు కాలేవన్నారు. తాను మంత్రిని కూడా కాలేదన్నారు. ఒక ఎయిడెడ్ కాలేజీ అనుమతి కోసం సంవత్సరం తిరిగానని గుర్తు చేశారు. ప్రెంచ్ విప్లవం నియంతృత్వాన్ని పడగొట్టిందని.. తెలంగాణలో కూడా ఆత్మగౌరవం కోసం జాగృతి పోరాడుతుందని చెప్పారు. మేడారం పనుల టెండర్లలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో VTDA ద్వారా టెండర్లు ఇచ్చారని.. ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు కాంట్రాక్టు ఇస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మంత్రి సీతక్క మౌనంగా ఉండడం సరికాదని చెప్పారు.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ లేకపోవడం దారుణమని చెప్పారు. సమ్మక్క - సారక్క లెక్క జిల్లాలో మంత్రులు సీతక్క, సురేఖ ఉన్నారని.. ఈ ఇద్దరు మహిళా మంత్రులు జిల్లా అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాకతీయ యూనివర్సిటీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించాలని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అతిపెద్ద ఆసుపత్రి ఎంజీఎంను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనూ ఎంజీఎంను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా కడుతున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నది హరీష్ రావు కాంట్రాక్టు కంపెనీ అట కదా! అంటూ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల అభివృద్ధి: భట్టి
రేవంత్, కేసీఆరే బ్యాడ్ బ్రదర్స్: కిషన్ రెడ్డి