Share News

Central Minister Kishan Reddy: రేవంత్‌, కేసీఆరే బ్యాడ్‌ బ్రదర్స్‌

ABN , Publish Date - Nov 09 , 2025 | 02:56 AM

సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లే బ్యాడ్‌ బ్రదర్స్‌ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఇద్దరూ తెలంగాణ పాలిట శాపంగా మారారని, వీరికి మూడో బ్యాడ్‌ బ్రదర్‌గా అసదుద్దీన్‌ ఒవైసీ తోడయ్యారని ఆరోపించారు.....

Central Minister Kishan Reddy: రేవంత్‌, కేసీఆరే బ్యాడ్‌ బ్రదర్స్‌

  • వారిద్దరూ తెలంగాణ పాలిట శాపం

  • వారికి మూడో బ్యాడ్‌ బ్రదర్‌గా అసదుద్దీన్‌ తోడయ్యారు

  • అసమర్థత కప్పిపుచ్చేందుకే బీజేపీపై నెపం

  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఏ అంశంలో ఒక్కటయ్యాయ్‌

  • సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

హైదరాబాద్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లే బ్యాడ్‌ బ్రదర్స్‌ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఇద్దరూ తెలంగాణ పాలిట శాపంగా మారారని, వీరికి మూడో బ్యాడ్‌ బ్రదర్‌గా అసదుద్దీన్‌ ఒవైసీ తోడయ్యారని ఆరోపించారు. కేటీఆర్‌, కిషన్‌రెడ్డి బ్యాడ్‌ బ్రదర్స్‌ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్‌, అసదుద్దీన్‌, సోనియా కుటుంబమే తెలంగాణ పాలిట బ్యాడ్‌ బ్రదర్స్‌ అని అన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌.వి. సుభా్‌షతో కలిసి కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తెరచాటు రాజకీయాలు చేయడంలో కేసీఆర్‌, రేవంత్‌ దిట్ట అని, వారిద్దరూ తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. ఎంఐఎంను పెంచి పోషించి, వారి కనుసైగల్లో, వారి ఆలోచనలను అమలు చేస్తున్నారని విమర్శించారు. తమ వైఫల్యాలను, అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై, బీజేపీపై నెపం మోపుతున్నారని మండిపడ్డారు. ‘‘అవినీతి కేసుల నుంచి కేసీఆర్‌ను కాపాడుతున్నది మీ అధినాయకత్వం కాదా? మీ నాయకత్వం, బీఆర్‌ఎస్‌ ఢిల్లీలో ఒప్పందం చేసుకున్న విషయం వాస్తవం కాదా? చీము, నెత్తురు ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఏ విషయంలో ఒక్కటయ్యాయో ముఖ్యమంత్రి నిరూపించాలి’’ అని కిషన్‌రెడ్డి సవాల్‌ చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు, విద్యుత్‌ కొనుగోళ్ల కేసు ఏమైందని, ఒక్క బీఆర్‌ఎస్‌ నేతపైనైనా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. గడచిన పదేళ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధులను మరోసారి గణాంకాలతో సహా వివరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, వినే ధైర్యం రేవంత్‌కు, కేటీఆర్‌కు ఉందా? అని సవాల్‌ చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని రేవంత్‌ ఆరోపించడం దిగజారుడు రాజకీయమని, కాంగ్రెస్‌ ఓడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి సోయి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఫేక్‌ వీడియోలతో ప్రచారం చేశాయని, జూబ్లీహిల్స్‌లోనూ అలాగే చేస్తున్నాయని ఆరోపించారు. ‘‘రేవంత్‌ ప్రభుత్వం.. ఫేక్‌, ఫ్రాడ్‌, ఫాల్స్‌, ఫెయిల్యూర్‌ ప్రభుత్వం. గతంలో కేసీఆర్‌ ఫ్యామిలీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రభుత్వం ఉంటే.. ఇప్పుడు సోనియా ఫ్యామిలీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రభుత్వం ఉంది’’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.


కాంగ్రె్‌సకు ఓటమి తప్పదు: కె.లక్ష్మణ్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఓటమి తప్పదని తేలిపోయిందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి నిరాశా నిస్పృహలతో బీజేపీపై నిందలు వేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, గన్‌ కల్చర్‌ పెరిగిపోయిందని ఆరోపించారు. మాటలు తప్ప.. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన కానుక ఏమిటని ప్రశ్నించారు.

Updated Date - Nov 09 , 2025 | 02:56 AM