Share News

Saraswati Pushkaralu: పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - May 19 , 2025 | 04:53 AM

సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాళేశ్వర క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరిగిపోతుండడంతో కాళేశ్వరం క్షేత్రంలో వీధులన్నీ సందడిగా మారాయి.

Saraswati Pushkaralu: పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

  • నాలుగో రోజు 1.30 లక్షల మంది పుణ్య స్నానాలు

  • కాళేశ్వరంలో భక్తజనంతో కిక్కిరిసిన వీధులు

భూపాలపల్లి, మే18 (ఆంధ్రజ్యోతి): సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాళేశ్వర క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరిగిపోతుండడంతో కాళేశ్వరం క్షేత్రంలో వీధులన్నీ సందడిగా మారాయి. పుష్కరాల్లో మొదటి రెండు రోజులు జనం పెద్దగా కనిపించకపోయినా శని, ఆదివారాల్లోనే దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు 1.30 లక్షల మందికి పైగా భక్తులు సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేశారు. ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పుణ్యస్నాలు ఆచరించిన ప్రముఖుల్లో పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్ధండ విద్యాశంకర భారతి మహాస్వామి, హైకోర్టు న్యాయమూర్తి సుధా, ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఉన్నారు. భక్తుల రద్దీ పెరగడంతో మహాదేవపూర్‌ నుంచి కాళేశ్వరం దాకా ట్రాఫిక్‌ సుమారు 10 గంటల పాటు స్తంభించిపోయింది. దాదాపు 16 కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సులు, పైవ్రేట్‌ వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోవడంతో పుష్కరాలకు వచ్చిన భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు.


అన్నారం క్రాస్‌ వద్ద ఆర్టీసీ బస్సు నడిరోడ్డుపై పంచర్‌ కావడంతో ట్రాఫిక్‌ సమస్యలు మొదలైనట్లు భక్తులు చెప్పారు. ట్రాఫిక్‌ను సరి చేసేందుకు అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. వేలాదిమంది సరస్వతి ఘాట్ల వరకు మండుటెండలో కాలినడకన వెళ్లి పుణ్య స్థానాలు ఆచరించారు. ఆదివారం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిసినా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులకు తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చలివేంద్రాలు ఏర్పాటుచేసి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే భక్తులకు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. సోషల్‌ మీడియా ద్వారా పుష్కరాలకు సంబంధించి విస్తృత ప్రచారం జరుగుతుండడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ స్వయంగా కాళేశ్వరంలోనే విడిది చేసి వసతులు, ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు చేపడుతున్నారు. సరస్వతీ పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు కాళేశ్వర క్షేత్రం మొత్తాన్ని ఏరియల్‌ వ్యూ ద్వారా వీక్షించడం కోసం అధికారులు హెలీకాప్టర్‌ జాయ్‌ రైడ్‌ను యాత్రాదాం.ఓఆర్‌జి ద్వారా అందుబాటులోకి తెచ్చారు.హెలీకాప్టర్‌ ద్వారా పుష్కరాలను వీక్షించడం కోసం ఒక్కో వ్యక్తికి రూ.4,500లను రుసుముగా నిర్ణయించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..

Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన

Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత

For Telangana News And Telugu News

Updated Date - May 19 , 2025 | 04:53 AM