Fire Accident: పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత
ABN , Publish Date - May 18 , 2025 | 03:32 PM
Fire Accident: చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో మృతి చెందిన మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తయింది. మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
హైదరాబాద్, మే 18: చార్మినర్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం పూర్తయింది. అనంతరం ఆయా మృతదేహాలను బంధువులకు వైద్యులు అప్పగించారు. మృతదేహాల అప్పగింత కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ స్వయంగా పర్యవేక్షించారు.
గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో మరణించిన వారిలో పలువురు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాలను అత్తాపూర్ సన్ రైజ్ విల్లాస్‌కు, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12కి రెండు, సనత్ నగర్ స్వామి థియేటర్ బ్యాక్ సైడ్ 1, మోతి నగర్‌లోని రాజీవ్ నగర్‌కి మూడు మృతదేహాలు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకోగానే.. ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆసుపత్రికి చేరుకున్నారు.
హైదరాబాద్ మహానగరంలోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుల్జార్ హౌస్‌లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఇంట్లో ఏర్పాటు చేసిన ఏసీ కంప్రెషర్ పేలి మంటలు చెలరేగినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో తొలుత 11 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పలువురు మరణించారు. ఆ తర్వాత మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
For Telangana News And Telugu News