Kaleshwaram Project: చివరి దశకు కాళేశ్వరం విచారణ!
ABN , Publish Date - Jan 20 , 2025 | 03:38 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ చివరి దశకు చేరింది.
కేసీఆర్, హరీశ్, ఈటలకు నేడు సమన్లు?
హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ పీసీ ఘోష్
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ చివరి దశకు చేరింది. ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న జస్టిస్ ఘోష్ మంగళవారం నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునఃప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన పలు దఫాలుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇదే చివరి విడత కావచ్చని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరు కాలేకపోయిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును ఈసారి కమిషన్ ప్రశ్నించనుంది. దీంతో అధికారుల విచారణ పూర్తవుతుంది. బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆడిట్ నిర్వహించి నివేదిక రూపొందించిన కాగ్ అధికారులను సైతం కమిషన్ ప్రశ్నించనుంది.
చివర్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ కోసం పిలవనున్నట్లు తెలుస్తోంది. సోమవారం వీరికి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధమున్న నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్‌సీలు, ఇతర కీలక ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లతో పాటు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను కమిషన్ ఇప్పటికే ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాల ఎంపిక, ఇతర అంశాల్లో కేసీఆర్, హరీశ్‌రావు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇప్పటికే పలువురు అధికారులు వాంగ్మూలం ఇచ్చారు. వారందరి నుంచి సేకరించిన సాక్ష్యాధారాలతో కేసీఆర్, హరీశ్‌ను కమిషన్ ప్రశ్నించనుంది. ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఫిబ్రవరితో పూర్తి కానుంది. మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది.