kaleshwaram project: వేళ్లన్నీ కేసీఆర్‌వైపే
ABN , Publish Date - Aug 01 , 2025 | 03:21 AM
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌నే కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పుబట్టిందా
వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే ‘మేడిగడ్డ’ కుంగింది
ఎలాంటి పరీక్షల్లేకుండానే నిర్మాణ స్థలాల ఎంపిక.. బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయమూ కేసీఆర్‌దే
ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక!.. 650కి పైగా పేజీలతో రూపొందించిన కమిషన్
నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శికి 2 కాపీలు అందజేత.. నేడు సీఎంకు అందజేయనున్న మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌నే కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పుబట్టిందా!? అప్పట్లో ప్రభుత్వాధినేతగా వ్యవస్థలన్నిటినీ గుప్పిట్లో పెట్టుకుని.. ఏ విభాగాన్నీ సమర్థంగా పని చేయనివ్వకుండా నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని తేల్చిందా!? అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు విఫలం కావడానికీ ఇదే కారణమని అభిప్రాయపడిందా!? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. అప్పట్లో ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న నాయకులు కూడా ఈ వైఫల్యాలకు కారకులుగా కమిషన్ నిర్ధారించినట్లు వివరించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ గురువారం ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని కమిషన్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాకు జస్టిస్ ఘోష్ నివేదికను అందజేశారు. నివేదిక 650 పేజీలకు పైగా ఉంది. రెండు కాపీలను సీల్డ్ కవర్లలో అప్పగించారు. బ్యారేజీలు కట్టడానికి ముందు భూమి ఏ విధంగా ఉంది? బ్యారేజీల నిర్మాణానికి అనుకూలమా? కాదా? అనే అంశాలపై భూభౌతిక, సాంకేతిక పరీక్షలు చేయాల్సి ఉండగా.. అలాంటివేమీ చేయకుండానే బ్యారేజీల స్థలాలను ఎంపిక చేశారని కమిషన్ తప్పుపట్టినట్లు తెలిసింది. మేడిగడ్డపై నిర్ణయం తీసుకున్నాక అక్కడ బ్యారేజీ కట్టడానికి అనుకూలంగా నివేదికను తెప్పించుకున్నారని.. మంత్రివర్గం, ఉపసంఘం ఆమోదాలన్నీ నిర్మాణం ప్రారంభమయ్యాకే వచ్చాయని పేర్కొన్నట్లు సమాచారం. డిజైన్లకు తగ్గట్లుగా నిర్మాణం జరగలేదని, చాలా లోపాలు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2016లో బ్యారేజీ నిర్మాణం ప్రారంభమవగా.. 2019లో బ్యారేజీలు వినియోగించడానికి వీలుగా పనులు జరిగాయని, తొలి ఏడాదే వరదల అనంతరం బ్యారేజీల గేట్లు మూయగా దిగువ భాగ ంలో రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నట్లు సమాచారం. ఆ వ్యవస్థలు ఏటా చెల్లాచెదురవుతున్నా.. వాటిని సరిచేసే ప్రక్రియ జరగలేదని గుర్తుచేసినట్లు సమాచారం. ఇక బ్యారేజీల నిర్మాణం పూర్తయిన నాటినుంచి కార్యకలాపాలు, నిర్వహణ (ఓఅండ్‌ఎం) పనులు చేయనందువల్లే 2023 అక్టోబరు 21న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిందని కమిషన్ గుర్తు చేసింది.
బ్యారేజీల నిర్మాణం జరిగిన నాటి నుంచి నాలుగేళ్ల పాటు మేడిగడ్డలో ఓఅండ్‌ఎం పనులే జరగలేదని, నిర్మాణ సంస్థ కూడా దీనిపై నివేదించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్లే బ్యారేజీ దెబ్బతిన్నదని పేర్కొన్నట్లు తెలిసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఒక చోట ప్రతిపాదించి, మరో చోట నిర్మించారని, నిర్మాణానికి ముందు జరగాల్సిన పరిశీలన జరగలేదని, అందుకే బ్యారేజీల్లో సీపేజీలతో బుంగలు ఏర్పడ్డాయని కమిషన్ నిర్ధారించినట్లు సమాచారం. ఇక బ్యారేజీల్లో షీట్ పైల్స్ వినియోగించాల్సి ఉండగా.. సీకెంట్ పైల్స్ వినియోగించారని, దేశంలో ఏ ప్రాజెక్టులోనూ వీటిని వినియోగించినట్లుగా.. మన్నిక బాగున్నట్లుగా ఆధారాల్లేవని పేర్కొన్నట్లు తెలిసింది. షీట్ పైల్స్ స్థానంలో సీకెంట్ పైల్స్‌ను సరిగ్గా అమర్చకపోవడం వల్ల ఇసుక జారిపోయి.. బ్యారేజీలు కుంగడంతోపాటు సీపేజీలు ఏర్పడ్డాయని కమిషన్ వివరించినట్లు సమాచారం. బ్యారేజీలను నీటి మళ్లింపు కోసం వాడుకోవాల్సి ఉండగా.. నీటి నిల్వకు వినియోగించారని, ఎక్కువ కాలం నీటిని నింపడం వల్ల బ్యారేజీలు దెబ్బతిన్నాయని, నీటి నిల్వ నిర్ణయం కేసీఆర్‌దేనని కమిషన్ గుర్తించినట్లు తెలిసింది. ఇక భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని, వీటిని నియంత్రించడంలో ఆర్థిక శాఖ వైఫల్యం కూడా ఉందని పేర్కొంది. చెల్లింపులు, నిర్మాణ అంచనాలను అడ్డదిడ్డంగా చేసుకుంటూ/సవరించుకుంటూ పోయారని తప్పుపట్టినట్లు తెలిసింది. ఇక బ్యారేజీల నిర్మాణం జరుగుతున్నప్పుడు క్వాలిటీ కంట్రోల్ విభాగం కూడా సమర్థ పాత్రను నిర్వర్తించలేదని, నిరంతరం నాణ్యతను పరిశీలించి, రికార్డు చేయాల్సి ఉండగా.. ఆ పని చేయలేదని కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. మాజీ ఈఎన్‌సీలు సి.మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, బి.హరిరామ్, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డిల పాత్ర ఇప్పటికే విజిలెన్స్ నివేదికలో ఉండగా.. తాజాగా కమిషన్ నివేదికలో ఎస్‌ఈ కరుణాకర్ పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం.
నేడు బహిర్గతమవనున్న నివేదిక
జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను శుక్రవారం తెరవనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నివేదికను మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందించనున్నారు. ఈ నివేదికపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత నివేదికను మంత్రివర్గ సమావేశంలో పెట్టి చర్చించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
నా పాత్ర ముగిసింది: జస్టిస్ ఘోష్
నివేదిక అందించిన తర్వాత జస్టిస్ పినాకి చంద్రఘోష్ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. విచారణలో తన పాత్ర ముగిసిందన్నారు. విచారణ విధివిధానాలకు లోబడి నివేదికను సిద్ధం చేశామని తెలిపారు. విచారణ పూర్తికావడంతో శుక్రవారం సాయంత్రం కోల్‌కతాకు వెళ్తున్నట్లు చెప్పారు. విచారణతో ముడిపడిన అంశాల కోసం మళ్లీ హైదరాబాద్‌కు రానని గుర్తుచేశారు. నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని విలేకరులు అడగ్గా.. తనకు తెలియదని చెప్పారు. గత ఏడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్ వేయగా.. అదే ఏడాది జూన్ నుంచి విచారణ ప్రారంభమైంది. గత నెల 11న మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించడంతో విచారణ ముగిసింది. దాదాపు 13 నెలల పాటు జరిగిన విచారణ ప్రక్రియలో కమిషన్ 115 మందిని విచారించింది. విచారణ ప్రక్రియ అంతా సహజ న్యాయసూత్రాలకు లోబడే జరిగిందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ మినహా, అందరినీ బహిరంగంగానే విచారించారు.
రెండు నివేదికలు
కాళేశ్వరం బ్యారేజీల విచారణ నివేదికతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీ్‌సగఢ్‌తో విద్యుత్తు ఒప్పందం, పవర్‌గ్రిడ్‌తో కారిడార్ బుక్ చేసుకొని.. మళ్లీ వదులుకోవడానికి సంబంధించిన అంశాలపై విచారణ జరిపిన నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. విద్యుత్తు విచారణను జస్టిస్ మదన్ బి.లోకూర్ పూర్తిచేయగా.. ఆ నివేదికపై న్యాయ సలహా అనంతరం ముందుకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాళేశ్వరం నివేదిక కూడా అందడంతో త్వరలోనే ఈ రెండు నివేదికలపై సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో సమీక్ష జరిగే అవకాశాలున్నాయి. ఈ నివేదికను న్యాయ పరిశీలనకు పంపి, మంత్రివర్గంలో చర్చించిన తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. నివేదికను తెలుగు, ఉర్దూలో అనువాదం చేసి, సభ్యులకు అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. సభలో నివేదికలపై చర్చించి, విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. కాళేశ్వరం, విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణాలు/ఒప్పందాలపై విచారణ చేయించనున్నట్లు శాసనసభలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సభలకు సమాచారం ఇచ్చి.. తదుపరి చర్యల దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయి.
కాళేశ్వరం బాధ్యులపై ఇప్పటికే చర్యలు
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ లోపాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపి, నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదిక ఆధారంగా 38 మంది తాజా, మాజీ అధికారులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారిలో 36 మంది సంజాయిషీ ఇచ్చారు. బ్యారేజీల నిర్మాణాలు పూర్తికాకముందే పూర్తిచేసినట్లు ధ్రువపత్రాలు ఇచ్చిన ఈఈ, ఎస్‌ఈపై కూడా అభియోగాలను నమోదు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News