జడ్జీలు వ్యక్తులు కాదు.. వ్యవస్థ
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:44 AM
ఒకసారి న్యాయాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జడ్జీలు వ్యక్తిగా మాయ మై.. వ్యవస్థగా ప్రత్యక్షమవ్వాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ హితవు పలికారు.

ఉమ్మడి భాగస్వామ్యంతో న్యాయవ్యవస్థ బలోపేతం
న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలి
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పీఎస్ నరసింహ హితవు
హైదరాబాద్, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఒకసారి న్యాయాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జడ్జీలు వ్యక్తిగా మాయ మై.. వ్యవస్థగా ప్రత్యక్షమవ్వాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ హితవు పలికారు. జడ్జీగా విధులు నిర్వర్తించే సమయంలో వ్యక్తిగత అంశాలు ఏవీ ఉండవని తెలిపారు. సికింద్రాబాద్‌లోని జ్యుడీషియల్ అకాడమీలో శనివారం జరిగిన తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ద్వైవార్షిక సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ‘‘న్యాయవాదిగా ఉన్నంత వరకే వ్యక్తిగత విజయాలు, నైపుణ్యం, అత్యుత్తమంగా కేసును వాదించడం వంటి అంశాలు ఉంటాయి. ఒక్కసారి జడ్జిగా ఎంపికై విధుల్లో చేరితే వ్యవస్థలో భాగస్వామిగా మారిపోవాలి. జడ్జి వ్యక్తిగా మయమై.. వ్యవస్థగా ప్రత్యక్షమవాలి. జడ్జిగా వ్యవస్థలో భాగమైనప్పుడే అది మనల్ని కాపాడుతుంది. శాస్ర్తీయ ఆలోచన, కష్టపడేతత్వం, అధ్యయనం, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం జడ్జీలు తమ విధినిర్వహణలో అంతర్భాగంగా చేసుకోవాలి. న్యాయవ్యవస్థను బలోపేతం చేసి, సత్వరంగా కేసుల పరిస్కారానికి కృషి చేయాలి. ఈ వ్యవస్థలో న్యాయవాదులను భాగస్వాములుగా చేసుకోవాలి. అందరికీ అందుబాటులోఉండేలా.. వీలైనంత వేగంగా న్యాయం అందించేలా వ్యవస్థను తీర్చిదిద్దాలి. కేసుల పరిష్కరం కేవలం జడ్జీలపై ఉన్న బాధ్యత మాత్రమే కాదు. అది అందరి భాగస్వామ్యంతో ముందుకు సాగే ప్రక్రియ. జ్యుడీషియల్ అకాడమీ, హైకోర్టు, జిల్లా న్యాయవ్యవస్థ ఉమ్మడి భాగస్వామ్యంతోనే వేగవంతమైన, సమ్మిళిత పరిష్కార విధానాలు ఆవిష్కృతం అవుతాయి’’ అని పేర్కొన్నారు.
లోపాలను సమీక్షించుకోవాలి: జస్టిస్ సుజోయ్‌పాల్
మరో ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ మాట్లాడుతూ లోపాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలని సూచించారు. ‘‘ఒక క్రికెటర్ తాను శతకాలు చేసిన, ఘన విజయాలు సాధించిన మ్యాచ్‌ల కంటే వేగంగా అవుట్ అయిన మ్యాచ్‌లను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాడు. ఆ వీడియోలను ఒకటి పదిసార్లు చూసి విశ్లేషించుకుంటాడు. అదేతరహాలో మన లోపాలపై నిత్యం సాధన చేసి మరింత మెరుగ్గా రాణించాలి. క్రీడాస్ఫూర్తిని కలిగి ఉండాలి’’ అని అన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ జడ్జీలపై పనిఒత్తిడి ఉంటుందని, విరామం తీసుకోవడం కూడా నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పని ఒత్తిడి గురించి జస్టిస్ నరసింహ, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది.
తనకు నిద్రలో కూడా వాదనలు వింటున్నట్లే కలలు వస్తున్నాయని జస్టిస్ శ్రవణ్‌కుమార్ పేర్కొనగా.. తన కు ఇప్పటికీ న్యాయవాదిగా వాదనలు వినిపిస్తున్నట్లే కలలు వస్తున్నాయని జస్టిస్ నరసింహ అన్నారు. జిల్లా న్యాయవ్యవస్థలో పనిచేసే దాదాపు 450 మంది జడ్జీలు పాల్గొన్న ఈ సదస్సుకు జస్టిస్ పీఎస్ నరసింహ అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో వచ్చి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు అజయ్ నతానీ, తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు కే ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి కే మురళీమోహన్, జడ్జీల హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బీ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేతులు లేని ఓ దివ్యాంగురాలైన యువతి తన చిత్రపటాన్ని గీయడంపై జస్టిస్ నరసింహ హర్షం వ్యక్తంచేశారు. ఆమెను జ్ఞాపికతో సన్మానించారు.
ఇవి కూడా చదవండి...
Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే
Case On KTR: కేటీఆర్ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్
Read Latest Telangana News And Telugu News