Harish Rao: రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి ఇదొక అవకాశం: హరీశ్ రావు
ABN , Publish Date - Oct 24 , 2025 | 03:17 PM
బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు పంచి, తానే ఇచ్చినట్లు రేవంత్ చెప్పుకుంటున్నాడని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5 వేలు మాత్రమేనని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 24: రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రజలకు ఒక అవకాశమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) అన్నారు. ఇవాళ (శుక్రవారం) కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరించి మాట్లాడారు. ఆ నాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బస్సు యాత్ర చేశారని.. కాంగ్రెస్ కళ్లు తెరిపించాలంటే నిరుద్యోగులందరూ దండు కట్టి బయలుదేరి వాళ్లను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. నిరుద్యోగులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోసం చేశారు కాబట్టే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపుతో ఓడిపోయామని వాళ్లకు అర్థం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు నిరుద్యోగులను రేవంత్ రెడ్డి(Revanth Reddy) వేడుకున్నాడని, వాడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చెయ్యి చూపించి నిరంకుశంగా అణచివేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు పంచి, తానే ఇచ్చినట్లు రేవంత్ చెప్పుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5 వేలు మాత్రమేనని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే.. గూండాలు, రౌడీలు అసెంబ్లీలో ప్రవేశించే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏమీ అధికారం లేని టైంలోనే దందాలు, చిరు వ్యాపారుల నుంచి మామూళ్ల వసూళ్లు వంటివి చేశారని మండిపడ్డారు. వ్యభిచార గృహాలు నడిపిన దొంగలు కూడా.. కాంగ్రెస్ నామినేషన్ల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారని సంచలన ఆరోపణలు చేశారు. నామినేషన్ల ర్యాలీలోనే ఇంతలా రెచ్చిపోయారంటే.. రేపు వారిని గెలిపిస్తే దారుణాలు జరిగిపోతాయన్నారు. ప్రజలు గమనించి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి తమ అభ్యర్థి మాగంటి సునీతను ఆశీర్వదించాలని కోరారు.
కాగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గ నామినేషన్ ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. ప్రధాన పార్టీలు సహా మొత్తం 81 మంది ఇప్పటివరకు నామినేషన్స్ దాఖలు చేశారు. ఇక ఎంతమంది నామినేషన్ ఉపసంహరించుకుంటారోనని ఆసక్తి నెలకొంది. ఎక్కువ మంది అభ్యర్థులుంటే ఎన్నికల నిర్వహణలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒక్కో ఈవీఎం యూనిట్‌లో.. కేవలం 16 మంది అభ్యర్థులకే అవకాశం ఇచ్చారు. ఒకవేళ 81 మంది పోటీలో ఉంటే 6 ఈవీఎం యూనిట్ల అవసరం ఉంటుంది. ఇలా ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్, కౌంటింగ్‌లలో తీవ్ర ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది.
ఇవి కూడా చదవండి:
Jubilee Hills Congress: జూబ్లీహిల్స్ ప్రచారంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్..
Telangana Govt: కర్నూలు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా...