Jangaon: వరదలో కొట్టుకుపోయిన ప్రేమ జంట.. యువతి మృతదేహం లభ్యం
ABN , Publish Date - Oct 31 , 2025 | 04:31 PM
జనగాం జిల్లా శంకర్ తండా సమీపంలోని కుంటలో యువతి శ్రావ్య మృతదేహం లభ్యమయింది. నిన్న బోళ్లమత్తడి వద్ద ప్రేమికులు బరిగెల శివకుమార్, బక్క శ్రావ్య బైక్‌తో సహా నీటిలో కొట్టుకుపోయారు. చెట్టుకొమ్మ సాయంతో యువకుడు శివకుమార్ బయటపడగా, యువతి గల్లంతయ్యింది.
జనగామ, అక్టోబర్ 31: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొంథా తుపాను ప్రభావంతో నిన్నటివరకు భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. భారీ వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుంటలు, చెరువులు నిండిపోయి ఉదృతంగా ప్రవహించాయి. ఈ క్రమంలోనే జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తిమ్మంపేట శివారులో వరదల్లో గురువారం (అక్టోబర్ 30) ప్రేమ జంట గల్లంతయ్యింది. బోళ్లమత్తడి వద్ద ప్రేమికులు బరిగెల శివకుమార్, బక్క శ్రావ్య బైక్‌తో సహా నీటిలో కొట్టుకుపోయారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న శివకుమార్ చెట్టు కొమ్మను పట్టుకుని బయటపడగా.. శ్రావ్య గల్లంతయ్యింది.
వరదల్లో గల్లంతైన యువతి మృతదేహం ఇవాళ లభ్యమయింది. జిల్లాలోని శంకర్ తండా సమీపంలోని కుంటలో శ్రావ్య మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసు అధికారులు.. మృతదేహాన్ని స్వగ్రామం దమన్నపేటకు తరలించారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రియురాలి మృతితో ప్రియుడి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవి కూడా చదవండి:
Kalvakuntla Kavitha: ఎకరాకు రూ.10 వేలు కాదు.. రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలి: కవిత
KTR: రెండేళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం: కేటీఆర్